Dharmapuri Arvind: చంద్రబాబుకు ఏజెంట్‌లా రేవంత్ రెడ్డి పని చేస్తున్నాడు: ధర్మపురి అరవింద్

Arvind says Revanth Reddy is working like chandrababu agent
  • కేసీఆర్‌తో లోపాయికారి ఒప్పందం చేసుకున్నాడని విమర్శ
  • కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బినామీగా మారిపోయారని ఎద్దేవా
  • కేంద్రమంత్రిని కలిస్తే కేటీఆర్ ఫొటో చూపించాలన్న అరవింద్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు ఏజెంట్‌లా పని చేస్తున్నాడని, అదే సమయంలో కేసీఆర్‌తో లోపాయికారి ఒప్పందం చేసుకున్నాడని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. కేసీఆర్‌కు బినామీగా మారిపోయాడని మండిపడ్డారు. నిన్న ఆయన నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయ్ మండలం గన్నారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఒక కాంటా వరి ధాన్యాన్ని తూకం వేసేందుకు కడతా పేరుతో ఒకటిన్నర కిలోల వడ్లను తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ అడుగుజాడల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. కేసీఆర్‌కు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారని, కానీ వీళ్లు కూడా రైతులను నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయినా రైతుబంధు, రుణమాఫీ, పెన్షన్ పెంపు, ఇందిరమ్మ ఇళ్లు వంటి హామీలు అమలు కాలేదన్నారు. ధాన్యం కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధాన్యం అందుబాటులో ఉన్పప్పటికీ ఎందుకు కొనుగోలు చేయడం లేదో చెప్పాలన్నారు. 

కేంద్రమంత్రిని కలిసిన ఆధారాలేవి కేటీఆర్...

ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసినట్లు కేటీఆర్ చెబుతున్నారని, కానీ నిర్మాణ్ భవన్‌లో నలుగురైదుగురు మంత్రులు, క్లర్క్‌లు, అధికారులు, ప్యూన్‌లు ఉంటారని, అందులో ఎవరిని కలిశావో చెప్పాలని ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రిని కలిసినట్లు ఫొటో చూపించాలని డిమాండ్ చేశారు. అమృత్ ఫండ్స్‌లో కుంభకోణం జరిగిందని కేటీఆర్ కంటే ముందే బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు చేశారని, అది కొత్త విషయం కాదన్నారు. కేంద్రమంత్రిని కలిసినట్లు కనీసం ఆధారం ఉండాలి కదా అన్నారు.
Dharmapuri Arvind
Revanth Reddy
Chandrababu

More Telugu News