Surya Kumar Yadav: తెలుగు కుర్రాడు తిలక్ వర్మపై కెప్టెన్ సూర్య ప్రశంసలు

He asked for it and he delivered Surya Kumar Yadav Praises Tilak Verma

  • మూడవ స్థానంలో బ్యాటింగ్ చేస్తానంటూ అడిగి మరీ సత్తా చాటాడని మెచ్చుకున్న కెప్టెన్
  • తిలక్ వర్మ ప్రదర్శన పట్ల సంతోషంగా ఉందని వెల్లడి
  • యువ క్రికెటర్ల దూకుడు ఆటతీరుని ప్రశంసించిన సూర్యకుమార్ యాదవ్

సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అదరగొట్టాడు. సెంచరీ సాధించి టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించడంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. దీంతో మ్యాచ్ అనంతరం తిలక్ వర్మపై కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. సెంచూరియన్‌లో ఏం సాధించాడో అలా రాణించగల సమర్థవంతమైన ఆటగాడని తిలక్‌ను అభినందించాడు.

‘‘ తిలక్ వర్మ గురించి ఏం మాట్లాడగలను. నా దగ్గరికి వచ్చి మూడవ స్థానంలో బ్యాటింగ్ చేయవచ్చా అని అడిగాడు. ఈ రోజు నీ రోజు.. ఆస్వాదించు అని చెప్పాను. అతడు ఎంత సమర్థవంతుడో నాకు తెలుసు. మూడవ స్థానంలో బ్యాటింగ్‌ అడిగాడు, చేసి చూపించాడు. అతడి ప్రదర్శన విషయంలో నాకు సంతోషంగా ఉంది. తిలక్ వర్మ కుటుంబం కూడా చాలా ఆనందంగా ఉంది. అతడిని కచ్చితంగా మూడవ స్థానంలో కొనసాగిస్తాం’’ అని సూర్య కుమార్ యాదవ్ తెలిపాడు.

మిగతా కుర్రాళ్ల ప్రదర్శన విషయంలో కూడా కెప్టెన్ సూర్య సంతృప్తి వ్యక్తం చేశాడు. తాము ఆడాలనుకుంటున్న క్రికెట్ బ్రాండ్‌ను ప్రదర్శిస్తున్నారని కొనియాడాడు. టీమ్ మీటింగ్‌లో మాట్లాడుకున్న విషయాలను ఆచరించి చూపిస్తున్నారని అన్నాడు. యువ ఆటగాళ్లు నిర్భయంగా, దూకుడుగా ఆడుతున్నారని పొగిడాడు. ‘‘ ఆటగాళ్లకు మేము చెబుతున్న దానిని, నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నది, వారి ఫ్రాంచైజీలకు ఆడుతున్న ఆట తీరునే ఇక్కడా ప్రదర్శిస్తున్నారు. కొన్ని మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా వారి ఉద్దేశాన్ని గట్టిగా చాటిచెబుతున్నారు’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.

కాగా సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మూడో టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. తిలక్ వర్మ సెంచరీ సాయంతో టీమిండియా నిర్దేశించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆతిథ్య సఫారీ జట్టు ఛేదించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులకే పరిమితమైంది. దీంతో 11 పరుగుల తేడాతో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది.

  • Loading...

More Telugu News