Vangalapudi Anitha: అప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చినా జగన్ అసెంబ్లీకి రారు.. హోంమంత్రి అనిత

Home Minister Vangalapudi Anitha Comments On Jagan

  • రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అయితే జగన్ అసెంబ్లీ వైపే చూడరన్న హోంమంత్రి అనిత
  • దీనిపై ప్రజలు పందేలు కూడా కాస్తున్నారని ఎద్దేవా
  • రవీందర్‌రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఏపీ హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని అంటున్నారని, కానీ, రఘురామకృష్ణరాజు ఉప సభాపతి అయితే ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయన అసెంబ్లీకి రారని పేర్కొన్నారు. ప్రజలు దీనిపై పందేలు కూడా కాస్తున్నారని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నిన్న మాట్లాడిన హోంమంత్రి.. జగన్ తీరుపై విరుచుకుపడ్డారు. 

జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలను దూషిస్తూ అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వర్రా రవీందర్‌రెడ్డిని తాము అరెస్ట్ చేస్తే, జగన్ మాత్రం ఎన్‌హెచ్ఆర్సీకి వెళ్లి అతడిని రక్షించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుచేసిన వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లకుండా ఫంక్షన్ హాల్‌కు తీసుకెళ్లి శాలువాలు కప్పాలా? అని మండిపడ్డారు.

రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని ఎన్‌హెచ్ఆర్సీ ముందు గగ్గోలు పెడుతున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి వంటి వాళ్లకు మహిళలను కించపరుస్తూ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పెడుతున్న పోస్టులు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఆడబిడ్డల రక్షణకు బలమైన చట్టం తీసుకొచ్చే యోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్టు ఆమె తెలిపారు. మహిళలపై నేరాలకు సంబంధించి ఈ ఏడాది జూన్ నుంచి అక్టోబర్ వరకు నమోదైన 7,393 కేసుల్లో 12,115 మంది నిందితుల్లో కొందరిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News