Raghu Rama Krishna Raju: రఘురామ నా క్లాస్ మేట్: విష్ణుకుమార్ రాజు

BJP MLA Vishnu Kumar Raju revealed Raghu Rama Krishna Raju was his classmate
  • ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు
  • అభినందనలు తెలిపిన అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు
  • రఘురామతో తన అనుబంధం 46 ఏళ్ల నాటిదని వెల్లడి 
  • మీ రాజసం తగ్గనివ్వవద్దు అంటూ సూచన
ఇవాళ ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోలాహలం నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ గా ఎన్నిక కాగా, ఆయనకు శుభాభినందనలు తెలుపుతూ ప్రముఖుల ప్రసంగాలు కొనసాగాయి. బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు కూడా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన రఘురామతో తన అనుబంధం గురించి వివరించారు. 

"అధ్యక్షా... మీరు, నేను కలిసి చదువుకున్నాం. 1978లో నేను ఆంధ్రా యూనివర్సిటీలో బీఫార్మసీలో చేరాను. యూనివర్సిటీ మొత్తానికి ఫస్ట్ సీట్ నాదే అధ్యక్షా. కాలేజీకి వెళ్లాక... ఇంకా ఎవరెవరు చేరారు అనే ఆసక్తి ఉండడం సహజం. పది రోజుల తర్వాత మీరు కూడా బీఫార్మసీలో చేరడం జరిగింది అధ్యక్షా. అయితే మనిద్దరం రెండు నెలల కాలమే బీఫార్మసీలో కలిసి ఉన్నాం. ఆ తర్వాత నేను ఇంజినీరింగ్ సీటు రావడంతో వెళ్లిపోయాను. మీరు బీఫార్మసీలో కొనసాగారు. ఆ తర్వాత మీరు పీజీ కూడా చేశారు. మీకు, నాకు 46 సంవత్సరాల అనుబంధం ఉంది అధ్యక్షా!" అని విష్ణుకుమార్ రాజు వెల్లడించారు. 

నేను బీజేపీలో ఉండడం వల్ల తప్పించుకున్నాను

గత ప్రభుత్వం ఎవరినీ వదల్లేదు. ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురిచేసింది. భౌతికంగా ఇబ్బందులు, లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు సృష్టించారు. ఏదైనా ఉంటే నేను కూడా ఓపెన్ గా మాట్లాడే వ్యక్తిని. నాపై కూడా అప్పుడు కేసు పెట్టారు. 

నా అదృష్టం ఏమిటంటే... నేను బీజేపీలో ఉన్నాను. లేకపోతే... మీకు ఏ విధంగా ట్రీట్ మెంట్ జరిగిందో, నాక్కూడా అదే జరిగేది... బీజేపీలో ఉండడం వల్ల తప్పించుకున్నాను. ఆ రోజున పెద్దలు కొంత అభయం ఇచ్చారు కాబట్టి బతికి బయటపడ్డానని అనుకుంటున్నాను. 

మీ నుంచి ఇక పల్లెటూరి భాష వినలేం అధ్యక్షా!

ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న మీకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండి సీటు ఇచ్చారు. మీరు అద్భుతమైన విజయం సాధించి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయ్యారు. మేం ఎప్పుడో చిన్నప్పుడు విన్న పల్లెటూరి వాడుక భాషను, యాసను, ప్రాసను మీ నుంచి వింటుండేవాళ్లం. 

కానీ, ఇప్పుడు మీరు డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ఇకపై మీరు అలాంటి భాషను వాడలేరేమో అధ్యక్షా. అదొక్కటే  లోటు అధ్యక్షా. ఆ విధంగా మిమ్మల్ని కట్టడి చేశారు. మనకు రాజ్యాలు లేకపోయినా... ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక రాజులా ఎదుర్కొని నిలబడ్డారు. ఆ రాజసాన్ని కొనసాగిస్తారని నమ్ముతున్నాను అధ్యక్షా.
Raghu Rama Krishna Raju
Deputy Speaker
Vishnu Kumar Raju
BJP
TDP
AP Assembly Session

More Telugu News