Chandrababu: ప్రభుత్వ పాలసీలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన

CM Chandrababu statement on govt policies
  • పారిశ్రామిక రంగం అభివృద్ధికి ఏపీ సర్కారు నూతన పాలసీలు
  • 2047 నాటికి ఏపీ నెంబర్ వన్ గా ఉండాలన్న చంద్రబాబు
  • అందుకే ఈ పాలసీలు తీసుకువచ్చామని వెల్లడి
ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పాలసీలపై సీఎం చంద్రబాబు సభా ముఖంగా ప్రకటన చేశారు. 2047 నాటికి ఏపీ దేశంలోనే నెంబర్ వన్ గా ఉండాలనే ఈ పాలసీలు తీసుకువచ్చామని వెల్లడించారు. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త అనే నినాదాన్ని సాధ్యం చేసి చూపుతామని స్పష్టం చేశారు. 

రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల మందికి ఉపాధి రావాలనేది ప్రభుత్వ లక్ష్యమని, పెట్టుబడి ప్రాజెక్టులు నిర్దేశిత సమయానికి మొదలయ్యేలా ప్రత్యేక వ్యవస్థను తీసుకువస్తామని చెప్పారు. పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేయాలనేది లక్ష్యమని, ఎంఎస్ఎంఈల ద్వారా రూ.50 వేల కోట్ల పెట్టుబడులు ఆశిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. 

ఉత్పత్తిలో ఏపీని గ్లోబల్ డెస్టినేషన్ గా మార్చాలనేది ప్రభుత్వ విధానమని తెలిపారు. అదే సమయంలో రూ.83 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు రావాలని ఆశిస్తున్నామని తెలిపారు. ఏ పాలసీ అయినా 2024 నుంచి 2029 వరకు కచ్చితంగా అమల్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. 

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రతి చోట ఒక ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. పారిశ్రామిక పార్కులు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఉంటాయని అన్నారు. పోర్టు ఆధారిత పరిశ్రమల ద్వారా ఏపీని అభివృద్ధి పథంలో నిలుపుతామని చెప్పారు. ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాలు ఇచ్చేలా కొత్త విధానాలు అమలు చేస్తామని తెలిపారు. 

"రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తాం. అమరావతి, విశాఖ, రాజమండ్రిలో ఇన్నోవేషన్ హబ్ లు ఏర్పాటవుతాయి. విజయవాడ, తిరుపతి, అనంతపురంలో టాటా ఇన్నోవేషన్ హబ్ లు వస్తున్నాయి. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల మహిళలు పారిశ్రామికంగా ఎదిగేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తాం. 

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. డ్రోన్ దీదీ కేంద్ర పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలెట్ గా ట్రైనింగ్ ఇస్తాం. వ్యవసాయ రంగంలో 10 వేల మందికి పైగా మహిళలకు డ్రోన్లపై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. 

ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలో భాగం ప్రతి ఉత్పత్తికి ఒక క్లస్టర్ ఏర్పాటు చేస్తాం. పండించే పంటకు విలువ జోడిస్తేనే అధిక ఆదాయం పొందవచ్చు. విలువ జోడించడం ద్వారా ఏపీ ప్రపంచానికే ఫ్రూట్ బాస్కెట్ గా అవతరిస్తుంది" అని చంద్రబాబు వివరించారు.
Chandrababu
Govt Policies
AP Assembly Session
TDP-JanaSena-BJP Alliance

More Telugu News