Virat Kohli: ఆస్ట్రేలియాలో భారత్-ఏ జట్టుతో తలపడుతున్న టీమిండియా.. చేతులెత్తేసిన సీనియర్లు
- వార్మప్ మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన బ్యాటర్లు
- 15 పరుగులకే ఔట్ అయిన విరాట్ కోహ్లీ
- స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరిన రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్
సరిగ్గా మరో వారంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మొదలుకానుంది. నవంబర్ 22 నుంచి జరగనున్న ఈ సిరీస్‌కు ముందు కలవరపరిచే సంకేతాలు వెలువడ్డాయి. కొన్ని వారాలుగా ఆస్ట్రేలియాలోనే ఉన్న భారత్-ఏ జట్టుతో టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. బీసీసీఐ షెడ్యూల్ ప్రకారం పెర్త్‌లోని వాకా మైదానం వేదికగా శుక్రవారం ఉదయం ఈ మ్యాచ్ మొదలైంది. అభిమానులను అనుమతించకుండా నిర్వహిస్తున్న ఈ వార్మప్ మ్యాచ్‌లో జూనియర్ల ముందు సీనియర్ బ్యాటర్లు తేలిపోతున్నారు.
ముఖ్యంగా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. ఒక బ్యూటిపుల్ కవర్ డ్రైవ్ ఆడి ఆకట్టుకున్న విరాట్.. ఆ తర్వాత కొద్దిసేపటికే ఔట్ అయ్యాడు. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో రెండవ స్లిప్‌లో ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 15 పరుగులు మాత్రమే చేశాడు. ఔటైన వెంటనే నెట్స్‌లోకి వెళ్లి విరాట్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు.
ఇక న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో రాణించిన ఏకైక భారత బ్యాటర్ రిషబ్ పంత్ కూడా వార్మప్ మ్యాచ్‌లో ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. వ్యక్తిగత స్కోరు 19 పరుగుల వద్ద తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయి వెనుదిరిగాడు. పంత్ కొద్దిసేపు బాగానే ఆడుతున్నట్టు కనిపించాడు. కానీ బౌలర్లు షార్ట్ పిచ్ డెలివరీలు సంధించడం మొదలుపెట్టాక ఇబ్బందిపడ్డాడు. కొద్దిసేపటికే ఔట్ అయ్యాడు. ఇక ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా 15 పరుగులకే పెవిలియన్ చేరాడు.
కాగా భారత్-ఏ జట్టు బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇంతలా ఆపసోపాలు పడుతున్న భారత బ్యాటర్లకు ఆసీస్ స్టార్ బ్యాటర్లు పాట్ కమిన్స్, జాస్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ రూపంలో గట్టి సవాలు ఎదురుకావడం ఖాయమని అనిపిస్తోంది. వార్మప్ మ్యాచ్‌లో చక్కగా ఆడి ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంటారని భావిస్తే... విఫలమై మరింత ఆందోళనలు కలిగిస్తున్నారు.
ఇక వార్మప్ మ్యాచ్‌కు ముందు కేఎల్ రాహుల్ గాయం కారణంగా మైదానాన్ని వీడాడు. వైద్యుడు పరిశీలిస్తుండడం కనిపించింది. కేఎల్ రాహుల్ గాయంపై పూర్తి స్థాయి వివరాలు ఇంకా తెలియలేదు.