Bombay High Court: మైనర్ అయిన భార్య అంగీకారంతో శృంగారం చేసినా అది అత్యాచారమే.. పదేళ్ల జైలుశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు
- బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ కీలక తీర్పు
- 18 ఏళ్లు నిండని మహిళ అంగీకారంతో శృంగారంలో పాల్గొన్నా అది అత్యాచారమే అవుతుందని స్పష్టీకరణ
- ఆమె పెళ్లి చేసుకుందా? లేదా? అన్నది ఇక్కడ అప్రస్తుతమన్న కోర్టు
- కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించిన న్యాయస్థానం
మైనర్ భార్య అంగీకారంతో శృంగారంలో పాల్గొన్నప్పటికీ అది అత్యాచారమే అవుతుందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అలాంటి చర్యకు చట్ట ప్రకారం రక్షణ ఉండదని తేల్చి చెప్పింది. భార్యపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి కింది కోర్టు విధించిన పదేళ్ల శిక్షను బాంబే హైకోర్టు నాగ్‌పూర్ ధర్మాసనం సమర్థించింది. ఆమె వివాహం చేసుకుందా? లేదా? అన్న దానితో సంబంధం లేకుండా 18 ఏళ్లలోపు ఉన్న మహిళతో లైంగిక సంబంధం పెట్టుకోవడం అత్యాచారంగానే పరిగణించాలని జస్టిస్ జేఏ సనప్ పేర్కొన్నారు. భార్య లేదా అమ్మాయి వయసు 18 ఏళ్లు కంటే తక్కువ ఉన్నప్పుడు ఆమె అంగీకారంతో శృంగారంలో పాల్గొన్నప్పటికీ రక్షణ అందుబాటులో ఉండదని వివరించింది. ఈ కేసులో కింది కోర్టు నిందితుడికి విధించిన పదేళ్ల శిక్షను హైకోర్టు సమర్థించింది.
ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. పెళ్లికి ముందు తనతో బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకోవడం వల్ల గర్భం దాల్చాల్సి వచ్చిందని బాధిత మహిళ కోర్టుకెక్కింది. ఆ తర్వాత వారికి వివాహమైనప్పటికీ, కొంతకాలం తర్వాత వారి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. అనంతరం ఆమె భర్తపై కోర్టుకెక్కింది. వారికి పెళ్లి జరిగినప్పటికీ ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా శృంగారంలో పాల్గొన్నాడన్న ఆరోపణల నేపథ్యంలో అది అత్యాచారంగానే కోర్టు భావించింది.
మహారాష్ట్రలోని వార్ధాకు చెందిన బాధితురాలు తండ్రి, సోదరి, నానమ్మతో కలిసి నివసిస్తోంది. 2019లో ఆమె ఫిర్యాదు చేయడానికి ముందు మూడు నాలుగేళ్లపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లో ఉంది. ఈ క్రమంలో వారి మధ్య లైంగిక సంబంధం కారణంగా ఆమె గర్భం దాల్చింది. ఆ తర్వాత వివాహం చేసుకున్నప్పటికీ గర్భాన్ని తొలగించుకోవాలని భార్యపై అతడు ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో ఆమెపై భౌతిక దాడికి పాల్పడటమే కాక, ఆ బిడ్డ వేరే వ్యక్తి వల్ల కలిగిందని ఆరోపణలు చేశాడు. దీంతో ఆమె 2019లో పోలీసులను ఆశ్రయించగా నిందితుడు అరెస్టయ్యాడు. ఆ తర్వాత కేసు కోర్టుకు చేరింది. ఆమె సమ్మతితోనే తాను శృంగారంలో పాల్గొన్నట్టు అతడు చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది. అలాగే, ఆమెకు పుట్టిన బిడ్డకు డిఎన్ఏ పరీక్ష చేయించగా, వీరిద్దరే తల్లిదండ్రులని కూడా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో కింది కోర్టు విధించిన శిక్షను హైకోర్టు సమర్థించింది.