Infosys Narayana Murthy: తుది వరకు నాది అదే మాట.. ఆరు రోజుల పని విధానంపై ఇన్ఫీ నారాయణమూర్తి మళ్లీ అవే వ్యాఖ్యలు!
- సీఎన్‌బీసీ గ్లోబల్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో నారాయణమూర్తి ప్రసంగం
- వారానికి ఐదు రోజుల పని విధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఇన్ఫోసిస్ కో ఫౌండర్
- దేశ ఆర్థిక పురోభివృద్ధికి కష్టపడి పనిచేసే తత్వం, అంకితభావం అవసరమన్న వైనం
- బలమైన పని విలువలు లేని దేశం పోటీ ప్రపంచంలో నిలబడ లేదన్న మూర్తి
వారానికి ఆరు రోజుల పని విధానంపై ఇన్ఫోసిన్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి మరోమారు స్పందించారు. ఇండియా ఆర్థిక పురోభివృద్ధికి కష్టపడి పనిచేసే తత్వం, అంకితభావం అవసరమని పేర్కొన్నారు. పనితీరు, ఉత్పాదకతపై తరచూ మాట్లాడే నారాయణమూర్తి ఐదు రోజుల పని విధానాన్ని తానెప్పుడూ అంగీకరింబోనని తేల్చి చెప్పారు. తాజాగా సీఎన్‌బీసీ గ్లోబల్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో నారాయణమూర్తి మాట్లాడుతూ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ‘‘క్షమించండి. నేను నా అభిప్రాయాన్ని మార్చుకోను. నా తుదిశ్వాస వరకు దీనికి కట్టుబడి ఉంటాను’’ అని స్పష్టం చేశారు.
అలసిపోని అంకితభావానికి ప్రధాని మంత్రి నరేంద్రమోదీ ఒక మోడల్ అని నారాయణమూర్తి ప్రశంసించారు. దేశ పురోగతికి కష్టపడి పనిచేయడం చాలా అవసరమని పేర్కొన్నారు. బలమైన పని విలువలు లేని దేశం పోటీ ప్రపంచంలో వెనుకబడిపోతుందని హెచ్చరించారు. తాను విలువలతో ఎలా జీవించిందీ చెప్పుకొచ్చారు.
తన కెరియర్ మొత్తం సమయంతో సంబంధం లేకుండా పనిచేశానని వివరించారు. వారానికి ఆరు, ఆరున్నర రోజులపాటు రోజుకు 14 గంటలు పనిచేసేవాడినని గుర్తుచేసుకున్నారు. ఉదయం ఆరున్నర గంటలకు ఆఫీసుకు వెళ్తే మళ్లీ రాత్రి 8.40 గంటలకు ఆఫీసును విడిచిపెట్టేవాడినని తెలిపారు. తాను అలా పని చేసినందుకు గర్విస్తానని నారాయణమూర్తి చెప్పుకొచ్చారు. అలా పనిచేయడం తన వ్యక్తిగత ఎంపిక కాదని, అది బాధ్యత అని వివరించారు.