Princess Yuriko: 101 ఏళ్ల వయసులో కన్నుమూసిన జపాన్ యువరాణి
- జపాన్ రాజకుటుంబంలో అతి పెద్ద వయస్కురాలు ప్రిన్సెస్ యురికో
- గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న యువరాణి
- చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన రాజకుటుంబీకురాలు
జపాన్ రాజకుటుంబానికి చెందిన అత్యంత పెద్ద వయస్కురాలు, జపాన్ యువరాణి యురికో కన్నుమూశారు. ఆమె వయసు 101 సంవత్సరాలు. టోక్యో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రిన్సెస్ యురికో తుదిశ్వాస విడిచారని రాజకుటుంబం ఓ ప్రకటనలో తెలిపింది. యురికో మరణానంతరం జపాన్ రాజకుటుంబంలో మరో 16 మంది మాత్రమే మిగిలారు.
కాగా, యువరాణి అస్తమయం నేపథ్యంలో, జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా సంతాపం తెలియజేశారు. ఆమె మరణం పట్ల విచారం వ్యక్తం చేయడం మినహా మరేమీ చేయలేని పరిస్థితి అని తన ప్రకటనలో పేర్కొన్నారు. జపాన్ ప్రజలందరితో పాటు తాను కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని ఇషిబా వెల్లడించారు.
ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, ఓ మోస్తరు పక్షవాతం కారణంగా యువరాణి యురికో గత మార్చిలో ఆసుపత్రిలో చేరారు. ఆమె కిడ్నీలు, గుండె పనితీరు కూడా క్షీణిస్తున్నట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైంది.