YSRCP: తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి షాక్
- నిడదవోలులో 11 మంది కౌన్సిలర్ల రాజీనామా
- కౌన్సిల్ లో 16కు పడిపోయిన వైసీపీ బలం
- రాజీనామా చేసిన వారిలో మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్పారు. దాదాపు అన్ని జిల్లాల్లో నేతలు పెద్ద సంఖ్యలో పార్టీని వీడారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో వైసీపీకి భారీ షాక్ తగిలింది.
నిడదవోలులో 11 మంది వైసీపీ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేశారు. నిడదవోలు మున్సిపల్ కౌన్సిల్ లో వైసీపీకి 27 మంది సభ్యుల బలం ఉంది. వీరిలో 11 మంది రాజీనామాతో వైసీపీ బలం 16కు పడిపోయింది. వైసీపీకి రాజీనామా చేసిన వారిలో మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ కూడా ఉన్నారు. త్వరలోనే మరికొందరు కౌన్సిలర్లు కూడా వైసీపీకి రాజీనామా చేసే అవకాశం ఉందని చెపుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్సిపాలిటీపై వైసీపీ పూర్తిగా పట్టు కోల్పోయే అవకాశం ఉంది.
మరోవైపు, నిడదవోలులో ప్రస్తుతం జనసేన హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో రాజీనామా చేసిన వారు జనసేనలో చేరుతారా? లేక టీడీపీ తీర్థం పుచ్చుకుంటారా? అనే చర్చ జరుగుతోంది.