Joe Biden: సునీతా విలియమ్స్‌ను రక్షించడానికి నేను అంతరిక్ష కేంద్రానికి వెళ్లవచ్చు.. బైడెన్ సరదా వ్యాఖ్యలు

Joe Biden joked that he is going to space to bring back stranded astronauts Sunita Williams and Barry Wilmore
  • మా ఆవిడ నన్ను అంతరిక్షానికి పంపిస్తానంటోందని చమత్కరించిన అమెరికా అధ్యక్షుడు
  • పెరూ అధ్యక్షుడు జెగర్రాతో మాట్లాడుతూ ద్వైపాక్షిక సమావేశంలో సరదా వ్యాఖ్యలు
  • అంతరిక్ష పరిశోధనలో సహకారంపై చర్చించిన ఇరు దేశాధినేతలు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నవ్వుల పువ్వులు పూయించారు. 5 నెలల క్రితం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్ఎస్) చిక్కుకున్న వ్యోమగాములు సునీతా విలియన్స్, బారీ విల్మోర్‌లను రక్షించడానికి తాను అంతరిక్షానికి వెళ్లవచ్చంటూ సరదాగా వ్యాఖ్యానించారు. వారిద్దరినీ తాను వెనక్కి తీసుకురావచ్చంటూ చెప్పి అందర్నీ నవ్వించారు. పెరూ అధ్యక్షుడు డీనా బొలార్టే జెగర్రాతో శుక్రవారం జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో అంతరిక్ష పరిశోధనలపై చర్చించిన సందర్భంలో బైడెన్ ఈ మేరకు చమత్కరించారు.

‘‘ప్రస్తుతం అక్కడ ఉన్న వ్యక్తి, ఫ్లోరిడా మాజీ సెనేటర్ (నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్‌ను ఉద్దేశించి) నాకు చాలా సన్నిహిత స్నేహితుడు. నన్ను అంతరిక్షానికి పంపించేయమని అతడికి ఫోన్ చేసి చెబుతానంటూ మా ఆవిడ అంటుంది. నన్ను కట్టడి చేయడం కష్టంగా ఉందని ఆమె భావించిన ప్రతిసారీ అంతరిక్షంలోకి పంపిస్తానని చెబుతుంటుంది. అంతరిక్షానికి పంపిస్తారేమోనని నాకు కొంచెం ఆందోళనగా ఉంది. ఎందుకంటే తిరిగి తీసుకురావాల్సిన మన వ్యోమగాములు అక్కడ ఉన్నారు’’ అని జో బైడెన్ నవ్వుతూ చెప్పారు. ఇక అమెరికా, పెరూ అంతరిక్ష పరిశోధనలో పరస్పరం సహకరించుకుంటున్నాయని బైడెన్ అన్నారు.

కాగా అంతరిక్ష వాహక నౌక ‘స్టార్‌లైనర్’లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ విల్మోర్‌ ఐఎస్ఎస్‌లో చిక్కుకుపోయారు. ఈ ఏడాది జూన్ నెల నుంచి వారు ఐఎస్ఎస్‌లోనే ఉన్నారు. బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌ను జూన్ 5న ప్రయోగించగా.. జూన్ 6న స్పేస్ స్టేషన్‌లో దిగారు. ఇది 8 రోజుల మిషన్‌ అయినప్పటికీ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో హీలియం లీకేజీ, సాంకేతిక సమస్యల కారణంగా తిరుగు ప్రయాణం ప్రమాదకరమని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తిరిగి వారిని భూమికి తీసుకురానున్నారు.
Joe Biden
USA
Sunita Williams
Barry Wilmore

More Telugu News