Chandrababu: 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాం: చంద్రబాబు

We are preparing for 2029 elections says Chandrababu

  • మూడు పార్టీలను పవన్ కల్యాణ్ కలిపారన్న చంద్రబాబు
  • ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వస్తాయని ముందే ఊహించామని వ్యాఖ్య
  • కూటమి సుదీర్ఘకాలం కొనసాగుతుందన్న చంద్రబాబు

ప్రధాని మోదీ తమ నాయకుడని, ఆయన నాయకత్వంలో తామంతా ముందుకు సాగుతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

గత నెలలో హర్యానా సీఎం ప్రమాణస్వీకారం జరిగిన తర్వాత ఎన్డీయే కూటమి సీఎంలతో మోదీ భేటీ అయ్యారని... ఆ సమావేశం నాలుగు గంటల సేపు కొనసాగిందని చంద్రబాబు తెలిపారు. 2029 ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం కావాలని ఆ సమావేశంలో మోదీ అందరి అభిప్రాయాలను తీసుకున్నారని చెప్పారు. ఏపీలో 2029 ఎన్నికల కోసం తాము ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నామని తెలిపారు. 

గత వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వచ్చిందని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పవన్ కల్యాణ్ టీడీపీ, జనసేన, బీజేపీలను కలిపారని చెప్పారు. దాని ఫలితాన్ని ఎన్నికల్లో మనం చూశామని అన్నారు. ఏపీ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వస్తాయని తాము ముందుగానే ఊహించామని చెప్పారు. కూటమిలో ఎలాంటి సమస్యలు లేవని... అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతామని అన్నారు. కూటమి సుదీర్ఘకాలం పాటు కొనసాగుతుందని చెప్పారు.

సోషల్ మీడియాలో విపరీత ధోరణులు కనిపిస్తున్నాయని... మహిళలను కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అలాంటి వారిని ఉపేక్షించకూడదని అన్నారు.

  • Loading...

More Telugu News