ISRO: తొలిసారిగా స్పేస్ ఎక్స్ పై ఆధారపడుతున్న ఇస్రో... ఎందుకంటే...!

ISRO set to launch satellite with Elon Musk Space X rocket
  • త్వరలోనే ఫాల్కన్-9 రాకెట్ ద్వారా జీశాట్-ఎన్2 ఉపగ్రహ ప్రయోగం
  • జీశాట్-ఎన్2 బరువు 4,700 కిలోలు
  • ఉపగ్రహాన్ని భూస్థిర బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టనున్న ఫాల్కన్-9 రాకెట్
గత కొన్నేళ్లలో అంతరిక్ష రంగంలో ఎంతో పురోగతి సాధించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో... ఆశ్చర్యకరంగా ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ద్వారా ఓ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపాలని నిర్ణయించింది. 

ఇతర దేశాలకు చెందిన శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపిస్తూ భారీగా ఆర్జిస్తున్న ఇస్రో... ఇప్పుడు స్పేస్ ఎక్స్ ద్వారా తన శాటిలైట్ ను రోదసిలోకి పంపించడం వెనుక బలమైన కారణమే ఉంది. 

ఇస్రో ఇప్పటిదాకా భారీ సైజు ఉండే ఉపగ్రహాలను తన బాహుబలి రాకెట్ మార్క్-3 ద్వారా రోదసిలోకి పంపిస్తోంది. అయితే మార్క్-3 రాకెట్ 4,000 కిలోల బరువున్న శాటిలైట్లను మాత్రమే భూస్థిర బదిలీ కక్ష్యలోకి ప్రవేశపెట్టగలదు. ఇస్రో రూపొందించిన తాజా కమ్యూనికేషన్ శాటిలైట్ జీశాట్-ఎన్2 (GSAT-N2) బరువు 4,700 కిలోలు. ఈ కారణంతోనే ఇస్రో స్పేస్ ఎక్స్ పై ఆధారపడుతోంది. 

స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ త్వరలోనే జీశాట్-ఎన్2 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. స్పేస్ ఎక్స్ కు చెందిన రాకెట్ ను ఉపయోగించుకుని ఇస్రో చేపడుతున్న మొదటి వాణిజ్యపరమైన ఉపగ్రహ ప్రయోగం ఇదే. 

కాగా, జీశాట్-ఎన్2 శాటిలైట్ ద్వారా... విమానాల్లో ఇంటర్నెట్ సేవలు అందించడానికి వీలుపడుతుంది. అంతేకాదు, భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ విస్తరణ సాధ్యపడుతుంది.
ISRO
Space X
Falcon-9 Rocket
GSAT-N2
Elon Musk
India

More Telugu News