Lashkar CEO: పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సీఈవోనంటూ రిజర్వ్ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు బెదిరింపు

RBI customer care gets threat call from Pak Lashkar CEO

  • నిన్న ఉదయం 10 గంటల సమయంలో కస్టమర్ కేర్‌కు ఫోన్
  • ఎలక్ట్రిక్ కారు చెడిపోయిందని, వెనుకవైపు రోడ్డును బ్లాక్ చేయాలని కోరిన వైనం
  • రంగంలోకి దిగి సోదాలు చేసిన పోలీసులు
  • ఫేక్ కాల్ అని నిర్ధారణ

పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సీఈవోనంటూ ముంబైలోని భారతీయ రిజర్వుబ్యాంకు కస్టమర్‌ కేర్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. నిన్న ఉదయం 10 గంటల సమయంలో కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసిన వ్యక్తి తనను తాను లష్కరే తోయిబా సీఈవోగా చెప్పుకున్నాడు. ఎలక్ట్రిక్ కారు ఒకటి చెడిపోయిందని, వెనుకవైపు రోడ్డును బ్లాక్ చేయాలని కోరాడు. 

విషయం వెంటనే ముంబై పోలీసులకు చేరడంతో వారు సోదాలు నిర్వహించారు. అయితే, అనుమానాస్పదంగా ఏదీ  కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల వరుసగా ఉత్తుత్తి బాంబు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఈ ఘటన కలకలం రేపింది. ఇటీవల నిందితులు తొలుత విమానాలను లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపు కాల్స్ చేశారు. ఆ తర్వాత స్కూళ్లు, ఇతర సంస్థకు బాంబు బెదిరింపు కాల్స్ చేసి భయపెట్టారు. 

తాజాగా బుధవారం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసిన వ్యక్తి విమానాన్ని పేల్చివేయబోతున్నట్టు చెప్పాడు. మహమ్మద్ అనే వ్యక్తి అజర్‌బైజాన్ నుంచి పేలుడు పదార్థాలతో విమానంలో వస్తున్నట్టు చెప్పాడు. ఇది కూడా ఫేక్ కాలేనని తేలింది. కాగా, గత కొన్ని వారాలుగా 400కుపైగా ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ప్రస్తుతం ఇలాంటి కాల్స్ తగ్గుముఖం పట్టాయి.

  • Loading...

More Telugu News