pm modi: ప్రధాని మోదీకి నైజీరియా అత్యున్నత పురస్కారం

nigeria honours pm narendra modi with grand commander of the order of the niger award

  • ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా తొలుత నైజీరియాలో అడుగు పెట్టిన ప్రధాని మోదీ
  • తమ దేశ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజెర్‌ను మోదీకి ప్రదానం చేసిన నైజీరియా 
  • ఇది కేవలం తనకు దక్కిన గౌరవం కాదని, 140కోట్ల భారతీయుల గౌరవానికి ప్రతీక అని పేర్కొన్న మోదీ 

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా తొలుత ఆదివారం నైజీరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీకి నైజీరియా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన 'గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజెర్'ను ప్రదానం చేసింది. అబుజలో పర్యటన సందర్భంగా మోదీకి ఈ అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు. 

ఫెడరల్ క్యాపిటల్ టెరిటరీ మంత్రి నైసోమ్ ఎజెన్‌వో సాదర స్వాగతం పలికి జ్ఞాపికను అందజేశారు. విశ్వాసం, గౌరవానికి గుర్తుగా 'అబుజా సిటీ కీ'ని మోదీకి బహూకరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి  ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 

కాగా, ఆదివారం ఉదయం అధ్యక్షుడి భవనంలో నైజీరీయా అధ్యక్షుడు బొలా అహ్మద్ టినుబుతో ప్రధాని మోదీ సమావేశమైయ్యారు. తనకు దేశ అత్యున్నత పురస్కారం అందజేసినందుకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది భారతదేశానికి, శతాబ్దాలుగా ఇండియా - నైజీరియా మధ్య కొనసాగుతున్న బంధానికి దక్కిన గౌరవంగా మోదీ అభివర్ణించారు. ఇది కేవలం తనకు దక్కిన గౌరవం కాదని, 140కోట్ల భారతీయుల గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. 

విదేశీ పర్యటనలో భాగంగా తొలుత నైజీరియాలో అడుగు పెట్టిన మోదీ, అనంతరం బ్రెజిల్, గుయానాలో పర్యటించనున్నారు. ఈ నెల 21 వరకూ ఆయన విదేశీ పర్యటనలో ఉంటారు. 
 

  • Loading...

More Telugu News