Manipur: మణిపూర్ లో మళ్లీ మంటలు.. జిరిబామ్ లో దమనకాండే కారణమా?

How Attack On Hmar Village In Manipurs Jiribam By Suspected Meitei Militants Sparked New Cycle Of Violence

  • కుకీ తెగకు చెందిన టీచర్ పై అత్యాచారం, హత్యతో మరోసారి రగులుతున్న మణిపూర్
  • మైతేయీ యువకుడిని దారుణంగా హత్య చేసిన కుకీలు
  • సీఆర్పీఎఫ్ బలగాల కాల్పుల్లో పదిమంది కుకీ మిలిటెంట్ల హతం
  • జిరిబామ్ లో ఆరుగురిని ఎత్తుకెళ్లి హత్య చేసిన కుకీ మిలిటెంట్లు

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మరోసారి రగులుతోంది. కుకీలు, మైతేయీ తెగల మధ్య జరుగుతున్న గొడవల్లో ఈ నెల 7 నుంచి నేటి వరకు 19 మంది చనిపోయారు. భద్రతా బలగాల పహారాలో కొంతకాలం దాడులు ఆగినా.. తాజాగా మరోసారి హింస చెలరేగింది. రెండు తెగలకు చెందిన ప్రజలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ దమనకాండను కొనసాగిస్తున్నారు. ఈ నెల 7న హమర్ ట్రైబ్ కు చెందిన ఓ 31 ఏళ్ల మహిళను దుండగులు దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. ఆపై మృతదేహాన్ని లోపల ఉంచి ఇంటికి నిప్పంటించారు. చనిపోయిన మహిళ కుకీ తెగకు చెందిన టీచర్, ముగ్గురు పిల్లల తల్లి.. ఈ దారుణానికి పాల్పడింది మైతేయీ మిలిటెంట్లేనని కుకీలు ఆరోపిస్తున్నారు.

ఈ దారుణం తర్వాత మైతేయీ యువకుడు ఒకరు హత్యకు గురయ్యాడు. ఆపై మరో కుకీ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు చంపేసి నదిలో పడేశారు. ఈ క్రమంలోనే సీఆర్పీఎఫ్ బలగాల దాడిలో పది మంది కుకీ తెగకు చెందిన యువకులు చనిపోయారు. వారంతా మిలిటెంట్లేనని మైతేయీలు ఆరోపిస్తుండగా.. గ్రామ రక్షక దళమని కుకీలు చెబుతున్నారు. ఈ ఘోరం జరిగిన రోజే జిరిబామ్ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో ఆరుగురు అదృశ్యమయ్యారు. ఇందులో ముగ్గురు మహిళలతో పాటు రెండేళ్ల వయసున్న ఓ చిన్నారి కూడా ఉన్నారు.

కనిపించకుండా పోయిన ఈ ఆరుగురిలో ముగ్గురి మృతదేహాలను అడవిలో గుర్తించడంతో జిరిబామ్ లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత రోజుకో మృతదేహం చొప్పున స్థానిక నదిలో కొట్టుకు వచ్చాయి. ఇది చూసి మైతేయీలు ఆగ్రహంతో రగిలిపోయారు. మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ పూర్వీకుల నివాసంతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రుల నివాసాలపై దాడులు చేశారు. ఇళ్లల్లోని ఫర్నీచర్ ను బయటకు తెచ్చి నిప్పంటించారు. సీఎం బీరేన్ సింగ్ అల్లుడి ఇంటిపైనా నిరసనకారులు దాడులు చేశారు. ఆదివారం మైతేయీ సంఘాల నేతలు సమావేశమై రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 24 గంటల్లో ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.

  • Loading...

More Telugu News