UK Royal Family: రాజు నివాసానికే కన్నం పెట్టిన దొంగలు... యూకే రాజభవనంలో చోరీ

Two intruders break into Windsor Castle And steal farm vehicles
  • ప్యాలెస్ లోకి ప్రవేశించి ఓ ట్రక్కు, బైకు ఎత్తుకెళ్లిన వైనం
  • అక్టోబర్ లో జరిగిన చోరీ వివరాలు ఆలస్యంగా వెలుగులోకి!
  • భద్రతా వైఫల్యంపై బ్రిటన్ లో ఆందోళన
బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్ నివాసంలో దొంగలు పడ్డారు. ఓ ట్రక్కు, మరో క్వాడ్ బైకు (నాలుగు చక్రాల బైకు)ను ఎత్తుకెళ్లారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్యాలెస్ లో చోరీ జరగడం కలకలం రేపింది. భద్రతా వైఫల్యంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ లో జరిగిన ఈ చోరీకి సంబంధించిన వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. 

అధికార వర్గాల సమాచారం ప్రకారం... ప్రిన్స్ ఛార్లెస్ దంపతులు వారంలో రెండురోజులు విండ్సర్ ప్యాలెస్ లో గడుపుతుంటారు. ఈ భవనానికి జస్ట్ 5 నిమిషాల నడక దూరంలో యువరాజు ప్రిన్స్ విలియమ్ దంపతుల నివాసం అడిలైడ్ కాటేజీ ఉంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 13న విండ్సర్ క్యాజిల్ లో దొంగతనం జరిగింది.

అర్ధరాత్రి ప్రాంతంలో ఇద్దరు దొంగలు ఫెన్సింగ్ దూకి విండ్సర్ క్యాజిల్ ఎస్టేట్ లోకి ప్రవేశించారు. నేరుగా సెక్యూరిటీ జోన్ లోని ఓ ఫామ్ వద్దకు వెళ్లి అక్కడున్న ట్రక్కును, బైక్ ను ఎత్తుకెళ్లారు. ట్రక్కుతో గేటును ఢీ కొట్టి పారిపోయారు. ఆ సమయంలో రాజదంపతులు క్యాజిల్ లో లేరని తెలుస్తోంది. 

అయినప్పటికీ తరచూ రాజదంపతులు వచ్చిపోయే భవనం కావడంతో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. రాత్రి పగలు తేడా లేకుండా సిబ్బంది పహారా కాస్తుంటారు. ఎస్టేట్ లో సెక్యూరిటీ అలారం కూడా ఉంటుంది. అనుమానాస్పద కదలికలు కనిపిస్తే అలారం మోగుతుంది. ఇంత భద్రత ఉన్నప్పటికీ దొంగతనం జరగడంపై అధికారుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. 

దొంగలు ట్రక్కును తీసుకెళుతుంటే అలారం ఎందుకు మోగలేదు... దొంగలు ఫెన్సింగ్ దూకినా సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు గుర్తించలేకపోయారనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై భద్రతా సిబ్బంది విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
UK Royal Family
King Charles
Windsor Castle
Royal Residence
Britain
Theft at Royal Family

More Telugu News