Borugadda Anil: రెస్టారెంట్‌లో పనిచేసే హేమసుందర్‌ను కొట్టా.. అంగీకరించిన బోరుగడ్డ అనిల్

Borugadda Anil Confess That He Attacked Hemasundar

  • ఓటర్లకు డబ్బు, గంజాయి పంపిణీ చేసేందుకు టీడీపీ వారు పిలిపించారని చెప్పాలని హేమసుందర్‌పై దాడి
  • అప్పట్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్న హేమసుందర్
  • తాజాగా ఈ కేసులో కోర్టు అనుమతితో బోరుగడ్డ విచారణ
  • ఫ్లయింగ్ స్క్కాడ్ విధులకు ఆటంకం కలిగించిన మరో కేసులో నేడు విచారణ

రెస్టారెంట్‌లో పనిచేస్తున్న సమయంలో బోరుగడ్డ అనిల్ తన అనుచరులతో వచ్చి బెదిరించాడని, ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు, గంజాయి పంపిణీ చేయడానికి టీడీపీ వారు పిలిపించారని చెప్పాలని బలవంతం చేశారని, అందుకు నిరాకరించడంతో తీవ్రంగా కొట్టి గాయపరిచాడన్న హేమసుందర్ ఫిర్యాదుపై నమోదైన కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణ సందర్భంగా హేమసుందర్, ఇతరులపై ఈ ఏడాది మే 9న దాడి చేయడం నిజమేనని బోరుగడ్డ అనిల్ అంగీకరించినట్టు తెలిసింది.

కొట్టాను కానీ.. ఆ విషయం గుర్తులేదు

ఈ కేసులో దర్యాప్తు కోసం మంగళగిరి కోర్టు అనుమతితో నిన్న ఉదయం తుళ్లూరు పోలీసులు రాజమహేంద్రవరం నుంచి బోరుగడ్డను తీసుకొచ్చి విచారించారు. టీడీపీ నేతలు డబ్బు, గంజాయి పంపిణీ చేయాలని తీసుకొచ్చారని రెస్టారెంట్‌లో పనిచేసే యువకులతో ఎందుకు చెప్పించాలని అనుకున్నారని, అలా బెదిరించాలని మిమ్మల్ని ఆదేశించింది ఎవరని అధికారులు ప్రశ్నించారు. దీని వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటన్న ప్రశ్నకు హేమసుందర్, ఇతర యువకులపై దాడి చేయడం నిజమేనని, కాకపోతే తనతోపాటు ఉన్నదెవరో తనకు గుర్తులేదని అనిల్ చెప్పాడు. యువకులపై దాడిచేస్తున్నప్పుడు తీసిన వీడియోను ఏం చేశారని, దానిని ఎవరికి పంపారన్న ప్రశ్నకు అసలు వీడియోనే తీయలేదని బుకాయించే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. విచారణ కోసం ఫోన్ ఇవ్వాలని కోరగా అప్పటి ఫోన్ తన వద్ద లేదని చెప్పాడు.


ఆ విచారణకు కూడా హాజరు కావాల్సిందే: కోర్టు
పోలీసుల విచారణ సమయంలో తనకు ఆరోగ్యం బాగాలేదని బోరుగడ్డ చెప్పడంతో పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. కాగా, తుళ్లూరు పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ విధులకు ఆటంకం కలిగించిన కేసులో అనిల్‌ను ఒక రోజు విచారణకు మంగళగిరి కోర్టు అనుమతించింది. ఈ కేసులో నేడు (మంగళవారం) బోరుగడ్డను ప్రశ్నించే అవకాశం ఉండడంతో అనారోగ్యం దృష్ట్యా హాజరు కాలేనని, వాయిదా వేయాలని కోరాడు. అయితే, అనారోగ్యంతో ఉన్నట్టు వైద్యులు నివేదిక ఇవ్వలేదు కాబట్టి విచారణ వాయిదా వేయలేమని న్యాయమూర్తి తెలిపారు. అనంతరం బోరుగడ్డను రాజమహేంద్రవరం జైలుకు తిరిగి తరలించారు. 

బోరుగడ్డ అనిల్ తనను కొట్టి గాయపరిచాడంటూ బాధితుడు హేమసుందర్ అప్పట్లో తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో తనకు న్యాయం చేయాలని ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తుళ్లూరు పోలీసులు కేసు దర్యాప్తును ప్రారంభించారు.

  • Loading...

More Telugu News