YS Avinash Reddy: వివేకా హత్య కేసులో కీలక పరిణామం... అవినాశ్ రెడ్డికి సుప్రీం నోటీసులు

Supreme Court issues notice to Avinash Reddy in Viveke Murder Case
  • అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న డాక్టర్ సునీత
  • సునీత పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
  • అవినాశ్ రెడ్డిని, చైతన్యరెడ్డిని ప్రతివాదులుగా చేర్చాలన్న సునీత న్యాయవాది
  • అంగీకరించిన సీజేఐ బెంచ్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. 

సునీత తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. వివేకా హత్యకు సంబంధించి మొదటి నుంచి జరిగిన పరిణామాలను లూథ్రా సీజేఐ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. అవినాశ్ రెడ్డి ఈ కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్నారని, ఈ కేసుకు సంబంధించి అతడు కీలకమైన వ్యక్తి అని వెల్లడించారు. 

అంతేకాకుండా, ఈ కేసులో అప్రూవర్ గా మారిన వ్యక్తిని (దస్తగిరి)... శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి జైలుకు వెళ్లి బెదిరించారని సిద్ధార్థ లూథ్రా సీజేఐ బెంచ్ కు తెలియజేశారు. ఒక ప్రైవేటు డాక్టర్ గా ఉన్న వ్యక్తి జైలులోకి వెళ్లి సాక్షులను బెదిరించే ప్రయత్నం చేశారని వివరించారు. 

చైతన్యరెడ్డి రెగ్యులర్ గా జైలుకు వెళ్లి ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు చేస్తుంటారా? అని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించగా... చైతన్యరెడ్డి రెగ్యులర్ గా జైలుకు వెళ్లే డాక్టర్ కాదని, నిబంధనలకు విరుద్ధంగా జైలులోకి వెళ్లారని లూథ్రా బదులిచ్చారు. ఈ నేపథ్యంలో అవినాశ్ రెడ్డి, చైతన్యరెడ్డిలను ప్రతివాదులుగా చేర్చాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. 

వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం అవినాశ్ రెడ్డి, చైతన్యరెడ్డిలను ప్రతివాదులుగా చేర్చేందుకు అంగీకరించింది. ఈ క్రమంలో వారిద్దరికీ నోటీసులు జారీ చేసింది. అనంతరం, ఈ కేసు తదుపరి విచారణను వచ్చే ఏడాది మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది.
YS Avinash Reddy
Notice
Supreme Court
YS Viveka Murder Case
YSRCP
Andhra Pradesh

More Telugu News