Narendra Modi: విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను మాకు అప్పగించండి!: బ్రిటన్ ప్రధానితో నరేంద్రమోదీ

India pushes UK for extradition of Vijay Mallya and Nirav

  • జీ20 సదస్సులో భాగంగా వివిధ దేశాధినేతలతో మోదీ భేటీ
  • బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో నరేంద్రమోదీ సమావేశం
  • బ్యాంకులకు వేలాది కోట్లు ఎగ్గొట్టిన మాల్యా, నీరవ్ మోదీ

ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలని ప్రధాని నరేంద్రమోదీ బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్‌ను కోరారు. బ్రెజిల్ వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో భాగంగా వివిధ దేశాధినేతలతో నరేంద్రమోదీ భేటీ అవుతున్నారు. బ్రిటన్ ప్రధానితోనూ ఆయన సమావేశమయ్యారు.

విజయ్ మాల్యా భారత్‌లో రూ.9 వేల కోట్ల మేర బ్యాంకులకు ఎగవేసి, 2016లో లండన్ పారిపోయాడు. నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించినట్లు 2018లో వెలుగు చూసింది. అతను కూడా బ్రిటన్‌లోనే తలదాచుకుంటున్నాడు. నీరవ్ మోదీ తమ దేశంలోనే నివసిస్తున్నాడని 2018 డిసెంబర్‌లో బ్రిటన్ ప్రకటించింది. 

వీరిద్దరిని తమకు అప్పగించాలని భారత్ ఎప్పటికప్పుడు బ్రిటన్‌ను కోరుతోంది. నీరవ్‌ను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఐదేళ్ల క్రితం ఆమోదం తెలిపింది. తనను భారత్‌కు అప్పగించే అంశాన్ని ఆయన బ్రిటన్ కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

ఆర్థిక నేరగాళ్లను అప్పగించే అంశంపై బ్రిటన్ సానుకూల ధోరణితోనే ఉన్నప్పటికీ... న్యాయపరమైన అంశాల వల్ల ఈ ప్రక్రియ క్లిష్టంగా మారుతోంది. 

కాగా, నేరపూరిత ఆరోపణలు ఎదుర్కొని తమ దేశంలో ఉంటున్న వారు భారత్‌లోనే విచారణను ఎదుర్కోవాలని తాము కోరుకుంటున్నామని బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. మరోవైపు, మాల్యా, నీరవ్‌లతో పాటు పన్ను ఎగవేత, మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మిడిల్‌మ్యాన్ సంజయ్ భండారిని కూడా రప్పించేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది.

  • Loading...

More Telugu News