Maharashtra: మొదలైన 'మహా' సంగ్రామం.. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ!

Maharashtra Assembly Elections 2024 Voting started for288 assembly seats in state
  • రాష్ట్రవ్యాప్తంగా ఒకే దఫాలో 288 నియోజకవర్గాలకు పోలింగ్ షురూ
  • బరిలో ఏకంగా 4,136 మంది అభ్యర్థులు
  • కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసిన ఎలక్షన్ కమిషన్
  • ఝార్ఖండ్‌లో రెండో దశ ఎన్నికల ప్రారంభం
యావత్ దేశం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు-2024 పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య రాష్ట్రంలోని మొత్తం 288 నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. అధికార బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి.. విపక్షాలతో కూడిన మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమి ప్రధానంగా తలపడుతున్నాయి. మొత్తం 4,136 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 2,086 మంది స్వతంత్ర అభ్యర్థులు కావడం గమనార్హం. 2019లో 3,239 మంది అభ్యర్థులు పోటీ చేయగా... ఈసారి అభ్యర్థుల సంఖ్య ఏకంగా 28 శాతం పెరిగిందని ఎలక్షన్ కమిటీ డేటా పేర్కొంది.

దాదాపు 150 నియోజక వర్గాల్లో రెబల్స్ పోటీలో ఉన్నారు. మహాయుతి, మహా వికాస్ అఘాడి కూటముల అభ్యర్థులకు రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది. పొత్తులో భాగంగా టికెట్ దక్కని చాలా మంది నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దిగారు.

ఒకే దశలో పోలింగ్ జరుగుతుండడంతో ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలను కూడా మోహరించారు. ఒక్క ముంబై నగరంలోనే ఏకంగా 30,000 మంది పోలీసులను రంగంలోకి దించారు. శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఐదుగురు అదనపు పోలీసు కమిషనర్లు, 20 మంది డిప్యూటీ కమిషనర్లు, 83 మంది అసిస్టెంట్ కమీషనర్లు, 2,000 మందికి పైగా ఇతర పోలీసు అధికారులు, 25,000 మంది సిబ్బందిని మోహరించినట్లు వెల్లడించారు. అదనంగా అల్లర్లను నియంత్రించేందుకు మూడు ప్లాటూన్లు విధుల్లో ఉంటాయని చెప్పారు.

ఝార్ఖండ్‌లో రెండో దశ పోలింగ్
మరోవైపు ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ఎన్నికలు పోలింగ్ కూడా మొదలైంది. మొత్తం 38 స్థానాలకు ఓటింగ్ ప్రారంభమైంది. కాగా సీఎం హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పనా సోరెన్, ప్రతిపక్ష నాయకుడు అమర్ కుమార్ బౌరీతో పాటు పలువురు ప్రముఖలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు రెండవ దశలో ఉన్నాయి.
Maharashtra
Maharashtra Election
Jharkhand
Election Commission

More Telugu News