Morne Morkel: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. తొలి టెస్టులో తెలుగు కుర్రాడు అరంగేట్రం!
- ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కే ఛాన్స్
- అవకాశం ఉందని చెప్పిన బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్
- పెర్త్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే ఛాన్స్ లేకపోవడంతో నితీశ్ రెడ్డికి అవకాశం ఇవ్వవచ్చని వెల్లడి
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రేపటి (శుక్రవారం) నుంచి ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ షురూ కానుంది. ఈ మ్యాచ్ ద్వారా తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి టెస్టు ఫార్మాట్‌లో అరంగేట్రం చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశాడు.
మీడియా ప్రశ్నలకు సమాధానంగా నితీశ్ కుమార్ రెడ్డి టెస్టు అరంగేట్రాన్ని మోర్నీ మోర్కెల్ దాదాపుగా ధ్రువీకరించాడు. మ్యాచ్ జరగనున్న ఆప్టస్ పిచ్ స్పిన్నర్లకు సహకరించే అవకాశం లేకపోవడంతో టీమిండియా తుది జట్టులో ఆల్ రౌండర్ కోటాలో నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కవచ్చని మోర్కెల్ అభిప్రాయపడ్డాడు.
‘‘ మేము స్క్వాడ్‌లోకి తీసుకున్న యువ ఆటగాళ్లలో నితీశ్ కుమార్ రెడ్డి ఒకడు. అతడు బ్యాటింగ్ ఆల్ రౌండ్ సామర్థ్యం కలిగి ఉన్నాడు. జట్టుకు ఉపయోగపడవచ్చు. మీరు భావిస్తున్నదానికంటే కొంచెం గట్టిగానే బ్యాటింగ్ చేయగలడు. కాబట్టి పెర్త్ పిచ్ లాంటి పరిస్థితులలో నితీశ్ కుమార్ రెడ్డి ముందంజలో ఉంటాడు. ముఖ్యంగా తొలి రెండు రోజులు అతడు చాలా కచ్చితమైన బౌలర్‌గా భావిస్తున్నాం. ఆల్ రౌండర్ స్థానాన్ని నితీశ్ కుమార్ రెడ్డితో భర్తీ చేసేందుకు అద్భుతమైన అవకాశం’’ అని మోర్నీ మోర్కెల్ వ్యాఖ్యానించాడు.
ఫాస్ట్ బౌలర్లపై భారాన్ని ఆల్ రౌండర్ తగ్గించాలని ప్రపంచంలో ఏ జట్టు అయినా కోరుకుంటుందని మోర్కెల్ వ్యాఖ్యానించాడు. కాబట్టి నితీశ్ కుమార్ రెడ్డిని ఏవిధంగా ఉపయోగించుకోబోతున్నామనేది వేచిచూడాలని అన్నాడు. జస్ప్రిత్ బుమ్రా అతనిని ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలని మోర్కెల్ పేర్కొన్నాడు.
కాగా పెర్త్ టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. దీంతో అన్‌క్యాప్డ్ ప్లేయర్లు అభిమన్యు ఈశ్వరన్, నితీశ్ కుమార్ రెడ్డిలకు చోటుదక్కవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.