Viral Video: కోనసీమ జిల్లాలో దారుణం.. తాను ప్రేమిస్తున్న అమ్మాయితో మాట్లాడాడని.. ఇంటర్ విద్యార్థిపై దాడి.. వీడియో ఇదిగో!

Inter Student Attacked For Talking With Another Boy Girlfriend In Konaseema
  • ముగ్గురు ఫ్రెండ్స్‌తో కలిసి దాష్టీకం
  • బూతులు తిడుతూ ఒకరి తర్వాత ఒకరిగా దాడి
  • ఈ నెల 5న ఘటన.. 19న సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడంతో వెలుగులోకి
  • బాధిత విద్యార్థి తండ్రి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి 
తాను ప్రేమించిన యువతితో మాట్లాడాడన్న కోపంతో ఇంటర్ విద్యార్థిపై కోపం పెంచుకున్న కుర్రాడు తన ముగ్గురి స్నేహితులతో కలిసి అతడిపై దాడిచేసి చితకబాదాడు. దాడి వీడియోను ఇటీవల సామాజిక మధ్యమాల్లో పోస్టు చేయడంతో అది వైరల్ అయి విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో వున్నారు. 

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తాను ప్రేమించిన అమ్మాయితో మాట్లాడిన ఏఎఫ్‌డీటీ జూనియర్ కాలేజీ ఇంటర్ సెకండియర్ విద్యార్థిపై ఓ బాలుడు కక్ష పెంచుకున్నాడు. విషయం తన స్నేహితులతో పంచుకుని దాడికి పథక రచన చేశాడు. ఈ నెల 5న తన ముగ్గురు స్నేహితులతో కలిసి బాధిత విద్యార్థిని స్థానిక సినిమా హాలు వెనకనున్న స్థలంలోకి తీసుకెళ్లారు. 

అక్కడ అందరూ కలిసి ఒక్కసారిగా అతడిపై దాడిచేశారు. పిడిగుద్దులు కురిపిస్తూ చితకబాదారు. కాళ్లతో తన్నుతూ చిత్ర హింసలు పెట్టారు. ఆపై చెట్టుకు కట్టి చొక్కాను మెడకు బిగించారు. విద్యార్థి మెడలో ఉన్న గొలుసును బిగించడంతో మెడపై తీవ్ర గాయమైంది. తనను వదిలిపెట్టాలని వేడుకున్నప్పటికీ కనికరించలేదు సరికదా, ఈ ఘటనను వీడియో తీశారు. నిందితులు అదే కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదివి మానేసి ఇళ్ల వద్దే ఉంటున్నట్టు తెలిసింది. 

విద్యార్థిపై దాడి వీడియోను ఈ నెల 19న సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయింది. దాడికి పాల్పడిన వారు, బాధిత విద్యార్థి అందరూ మైనర్లేనని పోలీసులు తెలిపారు. బాధిత విద్యార్థి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Viral Video
Dr BR Ambedkar Konaseema District
Inter Student
Crime News

More Telugu News