Jasprit Bumrah: బ్యాటర్ల కంటే బౌలర్లే మెరుగు... కెప్టెన్సీపై జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు

Jasprit Bumrah feels that Bowlers are tactically better than batters as Captains
  • బ్యాటర్ల కంటే బౌలర్లు ‘వ్యూహాత్మకంగా మెరుగు’ అన్న తాత్కాలిక కెప్టెన్
  • బౌలర్లకు తరచుగా కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తుండాలని అభిప్రాయం
  • పెర్త్ టెస్టుకు ముందు ప్రెస్ మీట్‌లో స్టార్ పేసర్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రేపు (శుక్రవారం) మొదలుకానుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో... పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రేపు మ్యాచ్ ప్రారంభం సందర్భంగా ఇవాళ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ బుమ్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

బౌలర్లు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం సాధారణ దృశ్యం కాకపోయినప్పటికీ... కెప్టెన్సీ విషయంలో బ్యాటర్ల కంటే బౌలర్లే 'వ్యూహాత్మకంగా మెరుగు’ అని బుమ్రా అభిప్రాయపడ్డాడు. అందుకే నాయకత్వ బాధ్యతలను తరచుగా బౌలర్లకు అప్పగిస్తుండాలని అన్నాడు. ఎల్లప్పుడూ పేసర్లే కెప్టెన్లుగా ఉండాలని తాను సూచిస్తానని బుమ్రా అన్నాడు. బౌలర్లు వ్యూహాత్మకంగా మెరుగ్గా ఉంటారని, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ అద్భుతంగా రాణిస్తున్నాడని ప్రస్తావించాడు. గతంలో కూడా చాలా మంది బౌలర్లు ఆదర్శవంతమైన కెప్టెన్లుగా ఉన్నారని పేర్కొన్నాడు. గతంలో కపిల్ దేవ్, ఇతర కెప్టెన్లు చాలా మంది బౌలర్లేనని బుమ్రా ప్రస్తావించాడు.

కెప్టెన్సీని పదవిగా భావించను

‘‘కెప్టెన్సీ ఒక గౌరవం. నాకు నా సొంత శైలి ఉంది. కెప్టెన్సీ విషయంలో విరాట్ వేరు, రోహిత్ వేరు. నాకు నా సొంత మార్గం ఉంది. కెప్టెన్సీని ఒక పదవిగా భావించను. బాధ్యతగా భావించడానికి ఇష్టపడతాను. ఇంతకుముందు రోహిత్ శర్మతో మాట్లాడాను. అయితే ఆస్ట్రేలియాకు వచ్చిన తర్వాతే నేను జట్టును నడిపించడంపై స్పష్టత వచ్చింది’’ అని బుమ్రా తెలిపాడు.

ఇటీవల న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో సిరీస్ ఓటమిని స్వదేశంలోనే వదిలివేశామని, ఆస్ట్రేలియా సిరీస్‌లో దాని ప్రభావం ఉండబోదని బుమ్రా స్పష్టం చేశాడు. 

‘‘గెలిచినప్పుడు సున్నా నుంచే ప్రారంభించాలి. ఓడిపోయినప్పుడు కూడా సున్నా నుంచే మొదలుపెట్టాలి. భారతదేశం నుంచి ఆస్ట్రేలియాకు ఎలాంటి భారాన్ని మోసుకురాలేదు. న్యూజిలాండ్ సిరీస్ నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఇక్కడ భిన్నమైన పరిస్థితుల్లో ఆడబోతున్నాం. ఫలితాలు కూడా భిన్నంగా ఉంటాయి’’ అని బుమ్రా చెప్పాడు. తుది జట్టుని ఖరారు చేశామని, రేపు ఉదయం మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రకటిస్తామని తెలిపాడు.
Jasprit Bumrah
Rohit Sharma
Cricket
Sports News
Border Gavaskar trophy
India Vs Australia

More Telugu News