Chandrababu: గత ప్రభుత్వం రాయలసీమకు చీమంత మేలు కూడా చేయలేదు: సీఎం చంద్రబాబు

CM Chandrababu speech after assembly resolution on Kurnool High Court bench
  • రాయలసీమ అభివృద్ధికి గత ప్రభుత్వం చీమంత కృషి కూడా చేయలేదన్న చంద్రబాబు
  • రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడి
  • శాసన సభలోసీఎం చంద్రబాబు ప్రసంగం
ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పటికే ఈ అంశంపై కేబినెట్ ఆమోదించిందని, అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని హైకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని అన్నారు. 

హైకోర్ట్ బెంచ్ ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. గత ప్రభుత్వం రాయలసీమకు చీమంత మేలు కూడా చేయలేదని విమర్శించారు. యువగళంలో ప్రకటించిన విధంగా మిషన్ రాయలసీమ హామీలను నెరవేర్చుతామని స్పష్టం చేశారు. 

"రాష్ట్ర సమగ్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం. గతంలో చేశాం... మళ్లీ చేసి చూపిస్తాం. రాయలసీమగా ఎడారిగా మారుతుందని ఆలోచించి కృష్ణా జలాలను సీమకు తరలించాలని ఆలోచించింది ఎన్టీఆర్. ఇందులో భాగంగానే తెలుగుగంగ, హంద్రీనీవా, నగరి గాలేరు ప్రాజెక్టులను ఎన్టీఆర్ ప్రారంభించారు. వాటిని పూర్తి చేసేది కూడా ఎన్డీయేనే. 

నదుల అనుసంధానం చేసి, పోలవరం పూర్తి చేసి గోదావరి నీళ్లను బసకచర్లకు తీసుకెళితే గేమ్ ఛేంజర్ అవుతుంది. కియా పరిశ్రమను తీసుకొచ్చేందుకు ఏడాదిలోనే గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశాం. కియా రాకతో అనంత జిల్లా ముఖచిత్రం మారిపోయింది. హార్టికల్చర్ అభివృద్ధి చేస్తే మహర్దశ వస్తుంది. 

సీమలోనూ మంచి రోడ్లు వచ్చాయంటే టీడీపీ హయాంలోనే. రాయలసీమలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. తిరుపతిని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చుతున్నాం. తిరుపతి ఐఐటీ, ఐసర్, కర్నూలులో ట్రిపుల్ ఐటీ, ఉర్దూ యూనివర్సిటీ, అనంతపురంలో సెంట్రల్ వర్సిటీ పెట్టి ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చాం. 

హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు 90 శాతం రాయితీతో డ్రిప్ సబ్సీడీ ఇచ్చాం... కానీ గత ప్రభుత్వం దాన్ని కూడా రద్దు చేసింది. మళ్లీ రాయితీతో డ్రిప్ ను రైతులకు అందిస్తాం. తిరుపతి హార్డ్ వేర్ హబ్ గా మారింది టీడీపీ హయాంలోనే. 

కేంద్రం రెండు ఇండస్ట్రియల్ పార్కులు ఇస్తే వాటిని కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తిలో ఏర్పాటు చేశాం. వీటి అభివృద్ధికి రూ.5 వేల కోట్లు మంజూరయ్యాయి. ఓర్వకల్లును డ్రోన్ హబ్ గా మార్చేందుకు 300 ఎకరాలు కేటాయించాం. కర్నూలను బెస్ట్ సిటీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం" అని వివరించారు.
Chandrababu
Mission Rayalaseema
Yuvagalam
Kurnool High Court Bench
TDP-JanaSena-BJP Alliance

More Telugu News