Kondru Sanjay Murthy: తొలిసారిగా కాగ్ పదవిలో తెలుగు వ్యక్తి... సంజయ్ మూర్తి
- నూతన్ కాగ్ గా కొండ్రు సంజయ్ మూర్తి
- నేడు రాష్ట్రపతి ముర్ము సమక్షంలో పదవీ స్వీకారం
- అమలాపురం మాజీ ఎంపీ కేఎస్సార్ మూర్తి తనయుడే సంజయ్ మూర్తి
భారత ప్రభుత్వ వ్యవస్థల్లో కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) అత్యంత కీలకమైనది. ప్రభుత్వాల ఆదాయ, వ్యయాలు, గణాంకాలపై కాగ్ పర్యవేక్షణ ఉంటుంది. ఈ నేపథ్యంలో, భారత నూతన కాగ్ గా కొండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారు. ఇవాళ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో కాగ్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటిదాకా గిరీశ్ చంద్ర ముర్ము కాగ్ గా బాధ్యతలు నిర్వర్తించారు.
కాగా, సంజయ్ మూర్తి కాగ్ గా నియమితుడు కాకముందు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా వ్యవహరించారు. సంజయ్ మూర్తి ఏపీలోని కోనసీమ జిల్లాకి చెందిన వ్యక్తి. ఈ విశిష్ట పదవి చేపట్టిన తొలి తెలుగు ఐఏఎస్ అధికారిగా ఘనత అందుకున్నారు.
సంజయ్ మూర్తి... అమలాపురం మాజీ ఎంపీ కేఎస్సార్ మూర్తి తనయుడు. కేఎస్సార్ మూర్తి 1996లో కాంగ్రెస్ తరఫున లోక్ సభ ఎన్నికల్లో గెలిచారు. సంజయ్ మూర్తి తండ్రి కేఎస్సార్ మూర్తి కూడా రాజకీయాల్లోకి రాకముందు ఐఏఎస్ అధికారిగా సేవలు అందించారు. కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి హోదాలో బాధ్యతలు నిర్వహించారు.
ఇక, సంజయ్ మూర్తి విషయానికొస్తే... 1964 డిసెంబరు 24న జన్మించారు. మెకానికల్ ఇంజినీరింగ్ లో పట్టభద్రులయ్యారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.
సంజయ్ మూర్తి హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం తీసుకురావడంలో ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా కీలకపాత్ర పోషించారు. వాస్తవానికి సంజయ్ మూర్తి ఐఏఎస్ గా వచ్చే నెలలో రిటైర్ అవ్వాల్సి ఉంది. అయితే, ఆయన అందించిన విశిష్ట సేవలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం కాగ్ గా కీలక పదవిలో నియమించింది.