USA: అమెరికా కేసు ఎఫెక్ట్... 'అదానీ'కి షాకిచ్చిన కెన్యా ప్రభుత్వం
- ఎయిర్‌పోర్ట్, విద్యుత్ సరఫరా లైన్ల కాంట్రాక్టును రద్దు చేసిన కెన్యా
- ఈ మేరకు ప్రకటన చేసిన కెన్యా అధ్యక్షుడు విలియం రూటో
- తొలుత ముప్పై ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకున్న కెన్యా
గౌతమ్ అదానీకి కెన్యా షాకిచ్చింది. గౌతమ్ అదానీకి ఇవ్వదలిచిన ఎయిర్‌పోర్ట్ టెండర్‌కు బ్రేక్ పడింది. లంచం ఆరోపణలపై అమెరికాలో అదానీ గ్రూప్‌పై కేసు నమోదైన నేపథ్యంలో కెన్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్ట్, విద్యుత్ సరఫరా లైన్ల కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో గురువారం వెల్లడించారు.
విద్యుత్ సరఫరా లైన్ల నిర్మాణానికి పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం కింద ముప్పై ఏళ్లకు కెన్యా ప్రభుత్వం 736 మిలియన్ డాలర్లకు అదానీ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ అమెరికాలో కేసు ఘటన నేపథ్యంలో ఈ ఒప్పందంపై కెన్యా ప్రభుత్వం వెనక్కి వెళ్లింది.
కెన్యాలోని ప్రధాన విమానాశ్రయమైన జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి కోసం అదానీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రభుత్వం ఆ ప్రాజెక్టును తాత్కాలికంగా నిలుపుదల చేసింది. తాజాగా, పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు ప్రకటించారు.