Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రతిష్టంభనకు తెరదించేందుకు రంగంలోకి జైషా!
- దుబాయ్ వెళ్లి ఐసీసీ అధికారులతో మాట్లాడనున్నారని సమాచారం
- పీసీబీ చీఫ్ నఖ్వీతో ఫోన్‌లో సంభాషించనున్న జై షా
- ఛాంపియన్స్ ట్రోఫీ వివాదానికి పరిష్కారం కోసం ప్రయత్నించే అవకాశం
వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టుని ఆతిథ్య పాకిస్థాన్‌కు పంపించబోమని బీసీసీఐ... మరోపక్క మెగా టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించే ప్రసక్తేలేదని పీసీబీ మొండిపట్టు... ఈ విధంగా కొన్ని వారాలుగా ఛాంపియన్స్ ట్రోఫీపై ఎడతెగని అనిశ్చితి కొనసాగుతోంది. అయితే ఈ ప్రతిష్టంభనకు వీలైనంత త్వరగా ముగింపు పలికి ఏదో ఒక పరిష్కారానికి రావాలని బీసీసీఐ సెక్రటరీ జై షా భావిస్తున్నారు.
ఈ మేరకు ఆయన త్వరలోనే ఐసీసీ అధికారులతో సమావేశమవనున్నారని, ఆ తర్వాత పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీతో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. జై షా దుబాయ్ వెళ్లి ఐసీసీ అధికారులతో సమావేశమవనున్నారని ‘ఏఆర్‌వై’ కథనం పేర్కొంది. ఇక పీసీబీ చీఫ్ నఖ్వీతో టెలిఫోన్‌లో మాట్లాడనున్నారని, ఈ సంభాషణలో సాధ్యమైన పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తారని పేర్కొంది.
మరోవైపు.. టోర్నీపై అనిశ్చితి కొనసాగుతుండగానే ఛాంపియన్స్ ట్రోఫీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా సుమైర్ అహ్మద్ సయ్యద్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు గురువారం నియమించింది. ఛాంపియన్స్ ట్రోఫీని పూర్తిగా పాకిస్థాన్‌లోనే నిర్వహించాలని భావిస్తున్నట్లు ఒక ప్రకటనలో ఆయన స్పష్టం చేశారు.
కాగా భద్రతా కారణాల రీత్యా టీమిండియాను పాకిస్థాన్ కు పంపించబోమంటూ ఐసీసీకి బీసీసీఐ అధికారికంగా తెలియజేసింది. భారత మ్యాచ్‌లను యూఏఈ వేదికగా నిర్వహించాలని, ఫైనల్ మ్యాచ్‌ను దుబాయ్ వేదికగా నిర్వహించాలని కోరింది. ఈ సమాచారాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ తెలియజేసింది. అయితే హైబ్రిడ్ మోడల్ విషయంలో పీసీబీ మొండి వైఖరిని కొనసాగిస్తోంది. తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించే ఉద్దేశం లేదని చెబుతోంది.