Perth Test: 1947 తర్వాత ఇదే తొలిసారి.. పెర్త్ టెస్టులో కెప్టెన్సీతో చ‌రిత్ర సృష్టించిన బుమ్రా, కమ్మిన్స్!

Jasprit Bumrah and Pat Cummins Script History With Perth Test Captaincy First Time Since 1947
  • బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదిక‌గా తొలి టెస్టు
  • ఈ టెస్టుకు రోహిత్ శ‌ర్మ గైర్హాజరుతో జ‌స్ప్రీత్ బుమ్రాకు జట్టు ప‌గ్గాలు
  • అటు ఆసీస్‌కు సార‌థిగా పేస‌ర్ ప్యాట్ క‌మ్మిన్స్
  • దాంతో రెండు జట్లకు కెప్టెన్లుగా ఇద్ద‌రూ ఫాస్ట్ బౌలర్లు
  • ఇలా జ‌ర‌గ‌డం 1947 తర్వాత ఇదే మొద‌టిసారి
బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదిక‌గా ఈరోజు ఉదయం భార‌త్‌, ఆస్ట్రేలియా మ‌ధ్య తొలి టెస్టు ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఈ టెస్టులో కెప్టెన్సీతో భారత స్టాండ్-ఇన్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా, ఆస్ట్రేలియా సార‌థి ప్యాట్‌ కమ్మిన్స్ చ‌రిత్ర సృష్టించారు. 1947 త‌ర్వాత‌ భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో రెండు జట్లకు ఫాస్ట్ బౌలర్లు కెప్టెన్లుగా వ్యవహరించడం ఇదే తొలిసారి. ఆప్టస్ స్టేడియంలో టాస్ సమయంలో కెప్టెన్లుగా ఇద్ద‌రు పేస‌ర్లు బుమ్రా, క‌మ్మిన్స్‌ కలిసి కనిపించడం క్రికెట్ వీక్షకులకు ప్రత్యేకమైన దృశ్యం ఆవిష్కృత‌మైంది.  

టీమిండియా రెగ్యుల‌ర్ కెప్టెన్‌ రోహిత్ శర్మ కొడుకు పుట్టిన కారణంగా పితృత్వ సెలవు తీసుకున్నాడు. దాంతో పేస‌ర్ బుమ్రాకు భార‌త జ‌ట్టు ప‌గ్గాలు చేప‌ట్టే అవ‌కాశం ద‌క్కింది. ఈ క్రమంలో పెర్త్‌ టెస్టుకు బుమ్రా భారత కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఇక కమ్మిన్స్ 2021 చివరి నుండి ఆస్ట్రేలియా జ‌ట్టు కెప్టెన్‌గా కొన‌సాగుతున్నాడు. 

కాగా, 1947/48లో భారత్ తొలిసారిగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో తలపడింది. ఈ సిరీస్‌లో భారత జట్టు 0-4 తేడాతో ఓడిపోయింది. అప్పట్లో ఆస్ట్రేలియా దిగ్గజం సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ నాయకత్వం వహించగా, భారత కెప్టెన్‌గా ఆల్ రౌండర్ లాలా అమర్‌నాథ్ ఉన్నారు.

ఇక టీమిండియా టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన చివరి భారత ఫాస్ట్ బౌలర్ కపిల్ దేవ్.ఆయ‌న 1985-86 పర్యటనలో జట్టుకు నాయకత్వం వహించాడు. ఆస్ట్రేలియా జట్టు విషయానికి వస్తే.. ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్‌పై ఏ ఫాస్ట్ బౌలర్ కూడా జట్టుకు సార‌థిగా వ్యవహరించలేదు. 2018-19, 2020-21లో భారత్‌ చివరి రెండు పర్యటనల్లో టీమ్ పైన్ ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఉన్నాడు.

ఇదిలాఉంటే.. పెర్త్ టెస్టులో మొద‌ట టాస్ గెలిచిన బుమ్రా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ టెస్టు ద్వారా తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డితో పాటు హర్షిత్ రాణా కూడా అరంగేట్రం చేశాడు. 
Perth Test
Jasprit Bumrah
Pat Cummins
Cricket
Sports News
Team India

More Telugu News