Hardeep Singh Nijjar: భారత్ ఆగ్రహంతో దిగొచ్చిన కెనడా.. దినపత్రిక కథనాలు ఊహాజనితమని కొట్టిపడేసిన ట్రూడో ప్రభుత్వం

Canada clean chits to Modi in Nijjar Murder case

  • ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య ప్రణాళిక మోదీ, జైశంకర్, దోవల్‌కు తెలుసంటూ కెనడా పత్రిక కథనం
  • భారత్ ఆగ్రహంతో వివరణ ఇచ్చుకున్న కెనడా ప్రభుత్వం
  • నిజ్జర్ హత్య సహా మరే నేర చర్యల్లోనూ వారి ప్రమేయం లేదని స్పష్టీకరణ

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్య కేసు సహా మరే నేర చర్యల్లోనూ భారత ప్రధాని మోదీ సహా ఆ దేశ అత్యున్నతాధికారులకు సంబంధం ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని కెనడా ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కనుసన్నల్లోనే నిజ్జర్ హత్య జరిగిందంటూ జాతీయ భద్రతాధికారిని ఉటంకిస్తూ కెనాడా దినపత్రిక ఒకటి కథనం రాసుకొచ్చింది. మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు నిజ్జర్ హత్య ప్రణాళిక గురించిన సమాచారం ఉందని పేర్కొంది. ఈ కథనాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.

తాజాగా ఇదే విషయమై కెనడా ప్రభుత్వం స్పందించింది. వార్తా కథనాన్ని సమర్థించేలా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నేరుగా ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ప్రజల భద్రతకు ముప్పు పొంచి ఉన్న వేళ అక్టోబర్ 14న రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు (ఆర్‌సీఎంపీ), అధికారులు కెనడాలో అసాధారణ చర్య తీసుకున్నారని, భారత ఏజెంట్లు కెనడాలో పాల్పడుతున్న నేర కార్యకలాపాలపై బహిరంగ ఆరోపణలు చేశారని పేర్కొంది. అయితే, ఈ కార్యకలాపాలకు సంబంధించి భారత ప్రధాని మోదీ, మంత్రి జైశంకర్ కానీ, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్‌కు కానీ సంబంధం ఉన్నట్టు కెనడా ఎప్పుడూ చెప్పలేదని వివరణ ఇచ్చింది. దీనికి విరుద్ధంగా ఎలాంటి కథనాలు ప్రచురితమైనా అవన్నీ ఊహా జనితమేనని స్పష్టం చేసింది.

గతేడాది జరిగిన నిజ్జర్ హత్యలో భారత ప్రధాని మోదీ హస్తం ఉందంటూ కెనడా దినపత్రిక ‘లుడిక్రౌస్’ ప్రచురించిన కథనంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో దిగొచ్చిన కెనడా ఈ ప్రకటన చేసింది.  

  • Loading...

More Telugu News