KL Rahul: పెర్త్ టెస్ట్: కేఎల్ రాహుల్ అవుట్‌పై వివాదం.. వీడియో ఇదిగో!

Perth Test KL Rahul unhappy after contentious DRS call
  • మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో వికెట్ల వెనక దొరికిపోయిన కేఎల్ రాహుల్
  • నాటౌట్‌గా ప్రకటించిన ఆన్ ఫీల్డ్ అంపైర్
  • రివ్యూ కోరిన ఆస్ట్రేలియా
  • విజువల్స్ అస్పష్టంగా ఉన్నప్పటికీ రాహుల్‌ను ఔట్‌గా ప్రకటించిన థర్డ్ అంపైర్
  • అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి ప్రకటిస్తూ మైదానం వీడిన రాహుల్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఆటగాడు కేఎల్ రాహుల్ అవుట్ వివాదాస్పదమైంది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో రాహుల్ వికెట్ల వెనక దొరికిపోయాడు. మంచి లెంగ్త్‌తో వచ్చిన బంతిని రాహుల్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అది నేరుగా వెళ్లి కీపర్ అలెక్స్ కేరీ చేతిలో పడింది. అవుట్ కోసం బౌలర్ అప్పీల్ చేయగా, ఆన్ ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటెల్‌బరో దానిని నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో ఆసీస్ వెంటనే రివ్యూను ఎంచుకుంది. 

రీప్లేలో స్పైక్ స్పష్టంగా కనిపించింది. బ్యాట్ ఎడ్జ్‌ను బంతి రాసుకుంటూ వెళ్లినట్టుగానూ ఉంది. విజువల్స్ అస్పష్టంగా ఉండడం, బంతి బ్యాట్‌ను తాకినప్పుడు శబ్దం వచ్చిందా? లేదంటే బ్యాట్ ప్యాడ్‌ను తాకినప్పుడు శబ్దం వచ్చిందా? అన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. స్పష్టమైన ఫ్రంట్ ఆన్ యాంగిల్ లేకపోవడంతో నిర్ణయం తీసుకోవడం కష్టమైంది. ఈ సందిగ్ధత ఉన్నప్పటికీ ఆన్‌ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని రద్దు చేస్తూ థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్.. రాహుల్‌ను అవుట్‌గా ప్రకటించాడు.  

    ఈ నిర్ణయంపై రాహుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. థర్డ్ అంపైర్ మరో యాంగిల్‌ను చెక్ చేయకపోవడంపై అసహనం ప్రదర్శించాడు. రీప్లేలో బంతి బ్యాట్‌ను తాకినట్టు కనిపించినా అందుకు సరైన ఆధారాలు లేవు. అయినప్పటికీ తనను థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించడాన్ని నమ్మలేకపోయిన రాహుల్ నిరాశగా తల ఊపుతూ మైదానాన్ని వీడాడు.  
KL Rahul
BGT 2024
Perth Test
Team India
Team Australia

More Telugu News