Kakani Govardhan Reddy: జగన్ పై అనుచిత పోస్టులు... పోలీసులకు మాజీ మంత్రి కాకాణి ఫిర్యాదు
- వేదాయపాలెం పీఎస్ లో కాకాణి ఫిర్యాదు
- అనుచిత పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్న కాకాణి
- టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెచ్చిపోతున్నారని మండిపాటు
వైసీపీ అధినేత జగన్ పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారంటూ వేదాయపాలెం పోలీసులకు వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో కాకాణి మాట్లాడుతూ... జగన్ పై కొందరు టీడీపీ కార్యకర్తలు దారుణమైన పోస్టులు పెడుతున్నారని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయనపై అనుచిత పోస్టులు పెట్టారని తెలిపారు. వాళ్ల వివరాలను సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు.
మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెచ్చిపోతున్నారని కాకాణి మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నట్టే... టీడీపీ వాళ్లపై కూడా కేసులు పెట్టాలని అన్నారు. రాజ్యాంగం అందరికీ ఒక్కటేనని చెప్పారు. సోమిరెడ్డి వల్ల ఇబ్బంది పడ్డ ఒక దళితుడి ఆవేదనను వాట్సాప్ లో షేర్ చేస్తే... తనపై కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తల పేర్లతో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు.