Real Estate Fraud: హైదరాబాదులో 'రియల్' టోకరా... రూ.150 కోట్లకు ముంచేశారు!
- ఆర్జే వెంచర్స్ పై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
- న్యాయం చేయాలంటూ పీఎస్ ముందు ఆందోళన
- రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు కట్టామని ఆవేదన
హైదరాబాదులో భారీ రియల్ ఎస్టేట్ మోసం తెరపైకి వచ్చింది. ఆర్జే వెంచర్స్ అనే సంస్థ ప్రీ లాంచ్ పేరుతో 600 మంది నుంచి రూ.150 కోట్లు వసూలు చేసి, నిలువునా ముంచేసింది. ఇవాళ ఆర్జే వెంచర్స్ బాధితులు సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పీఎస్ ముందు వారు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ, తమకు న్యాయం చేయాలని కోరారు.
నారాయణఖేడ్, పటాన్ చెరు, ఘట్ కేసర్ ప్రాంతాల్లో అపార్ట్ మెంట్లు, ఫామ్ ల్యాండ్ పేరుతో ఆర్జే వెంచర్స్ సంస్థ కస్టమర్లకు కుచ్చుటోపీ పెట్టింది. భారీగా డబ్బు వసూలు చేసిన ఈ వెంచర్స్ సంస్థ నాలుగేళ్లు గడుస్తున్నా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో, డబ్బు చెల్లించిన వారు లబోదిబోమంటున్నారు.
2020లో రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు డబ్బు కట్టామని, సంస్థను ఎన్నిసార్లు అడిగినా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని బాధితులు వాపోయారు. ఆర్జే వెంచర్స్ ఎండీ భాస్కర్ గుప్తా, సంస్థ డైరెక్టర్ సుధారాణి మాటలు నమ్మి డబ్బులు కట్టామని బాధితులు చెబుతున్నారు. గట్టిగా నిలదీస్తే, కొందరికి చెక్కులు ఇచ్చారని, కానీ అవి బౌన్స్ అయ్యాయని వారు వెల్లడించారు.