Vote Counting: దేశంలో అందరి దృష్టి ఇటువైపే... మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపే!

Vote counting in Maharashtra and Jharkhand tomorrow

  • మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు
  • ఈ నెల 20తో ముగిసిన పోలింగ్
  • నవంబరు 23న ఓట్ల లెక్కింపు
  • విజయంపై ఎవరికి వారే ధీమాగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ కూటముల నేతలు

ఈ నెల 20తో మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఝార్ఖండ్ కు రెండు విడతల్లో పోలింగ్ జరగ్గా, మహారాష్ట్రలో ఒక్క విడతలోనే పోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో, రేపు (నవంబరు 23) ఈ రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దాంతో, దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఈ రెండు రాష్ట్రాలపైనే ఉంది. ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఎవరికి వారే విజయం తమదే అని ధీమాగా ఉన్నాయి. 

కాగా, మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా... బీజేపీ-శివసేన (షిండే)-ఎన్సీపీ (అజిత్ పవార్) మహాయుతి కూటమి ఓవైపు... కాంగ్రెస్-శివసేన (ఉద్ధవ్ థాకరే)-ఎన్సీపీ (ఎస్ సీపీ)లతో కూడిన మహా వికాస్ అఘాడీ కూటమి మరోవైపు ఎన్నికల్లో హోరాహోరీ తలపడ్డాయి. రేపు ఈ పార్టీల అదృష్టం ఎలా ఉండనుందో వెల్లడి కానుంది. 

ఇక, ఝార్ఖండ్ లో రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 81 స్థానాలు ఉండగా... ఈ నెల 13న జరిగిన తొలి విడతలో 43 స్థానాలకు, ఈ నెల 20న జరిగిన రెండో విడతలో 38 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక్కడ కూడా నువ్వా నేనా అన్నట్టుగా అధికార జేఎంఎం-కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమికి... బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి పోరు జరిగింది. దాంతో కౌంటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

ఎగ్జిట్ పోల్స్ లో అత్యధికం ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ కూటమిదే విజయం అని వెల్లడైంది. మరి వాస్తవ ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

ఇక, కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కూడా రేపే జరగనుంది.

  • Loading...

More Telugu News