Jagan: రెండు పత్రికలు, పది చానళ్లలో ప్రతి రోజూ జగన్ పై విషం చిమ్ముతున్నారు: పేర్ని నాని

Perni Nani counters alliance leaders comments over Jagan
  • అమెరికాలో అదానీ గ్రూప్ పై కేసు
  • తెరపైకి జగన్ పేరు
  • కూటమి నేతల విమర్శలు
  • కౌంటర్ ఇచ్చిన పేర్ని నాని
అమెరికాలో అదానీ గ్రూప్ పై కేసు నమోదు కాగా, వైసీపీ అధినేత జగన్ పేరు కూడా తెరపైకి వచ్చిందంటూ ఏపీలో తీవ్ర రాజకీయ దుమారం రేగింది. కూటమి నేతలు జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో, వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. రాష్ట్రంలో 2 పత్రికలు, 10 చానళ్లు ప్రతి రోజూ జగన్ పై విషం చిమ్ముతున్నాయని విమర్శించారు. 

అమెరికాలో కేసులు అంటూ జగన్ పేరును తెరపైకి తీసుకురావడం ఇదేమీ కొత్త కాదని, గతంలో కూడా ఇలాగే ప్రచారం చేశారని మండిపడ్డారు. అప్పట్లో ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదని, జగన్ నే ముఖ్యమంత్రిగా గెలిపించారని పేర్ని నాని వివరించారు. ఇప్పుడు మరోసారి విషం వెళ్లగక్కుతున్నారని వ్యాఖ్యానించారు. 

జగన్ కు రూ.1,750 కోట్ల లంచాలు అని ఈనాడులో రాసిందని... ఇంటర్నేషనల్ గా జగన్ పేరు అంటూ టీడీపీ ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ జైలుపాలైనప్పుడు చంద్రబాబు పేరు అంతర్జాతీయంగా మార్మోగలేదా? అని పేర్ని నాని ప్రశ్నించారు. అదానీ... చంద్రబాబును కలిస్తే గొప్పగా రాసిన ఈనాడు... జగన్ ను అదానీ కలిస్తే మొత్తం దోచిపెడుతున్నారంటూ తప్పుడు వార్తలు రాయలేదా? అని నిలదీశారు. 

సెకీతో కరెంటు కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటే అవినీతికి పాల్పడినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు. పాతికేళ్ల పాటు యూనిట్ విద్యుత్ రూ.2.49కే ఇచ్చేందుకు సెకీ అంగీకరించిందని... ఇందులో అవినీతి ఎక్కడుందన్నారు. జగన్ కంటే ఏడాది ముందు, చంద్రబాబు పలు రకాల ధరలతో విద్యుత్ కొనుగోలు చేశారని, ఆ రోజు ఇతర రాష్ట్రాలు తక్కువ ధరకు కొనుగోలు చేస్తే, చంద్రబాబు మాత్రం ఎక్కువ ధరకు కొనుగోలు చేశారని పేర్ని నాని ఆరోపించారు.
Jagan
Adani Group
Perni Nani
YSRCP
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News