Elon Musk: వ్యక్తిగత సంపదలో చరిత్ర సృష్టించిన ఎలాన్ మస్క్!

Elon Musk is officially the wealthiest person in history with a net worth of 334 billion dollars

  • 334.3 బిలియన్ డాలర్లతో చరిత్రలో అత్యంత ధనవంతుడిగా నిలిచిన టెస్లా అధినేత
  • అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత ఏకంగా 40 శాతం వృద్ధి చెందిన టెస్లా షేర్లు
  • అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ విధానాలకు అనుకూలంగా ఉన్న ఎలాన్ మస్క్ వ్యాపారాలు
  • ట్రంప్ ప్రభుత్వంలో మస్క్ భాగస్వామి కూడా కావడంతో టెస్లా షేర్లకు రెక్కలు

టెస్లా, స్పేస్ఎక్స్ కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపదలో చరిత్ర సృష్టించారు. ఏకంగా 334.3 బిలియన్ డాలర్ల నికర ఆస్తి విలువతో చరిత్రలో అత్యంత ధనవంతుడిగా అవతరించారు. భారతీయ కరెన్సీలో ఈ విలువ సుమారు రూ.28.22 లక్షల కోట్లుగా ఉంటుంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ విధానాలకు ఎలాన్ మస్క్ వ్యాపారాలు అనుకూలంగా ఉండడం, నూతన సర్కారులో ఆయనకు కీలక పదవి కూడా దక్కడంతో టెస్లా కంపెనీ షేర్లలో అనూహ్య ర్యాలీ కొనసాగుతోంది. స్టాక్స్ పైపైకి దూసుకెళుతున్నాయి.

నవంబర్ 6న ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి శుక్రవారం వరకు ఏకంగా 40 శాతం మేర పెరిగాయి. శుక్రవారం ఒక్కరోజే 3.8 శాతం పెరగడంతో మూడేళ్ల గరిష్ఠ స్థాయి 352.56 డాలర్లకు షేర్ల విలువ చేరుకుంది. దీంతో మస్క్ సంపద 7 బిలియన్ డాలర్ల మేర వృద్ధి చెందింది. పర్యవసానంగా 2021లో రికార్డు స్థాయి సంపద 320.3 బిలియన్ డాలర్ల మొత్తాన్ని మస్క్ అధిగమించి చరిత్ర సృష్టించారని ఫోర్బ్స్ రిపోర్ట్ పేర్కొంది.

టెస్లా షేర్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం భారీగా పెరిగినప్పటికీ 2021లో నమోదయిన జీవితకాల గరిష్ఠ స్థాయికి ఇంకా 14 శాతం దిగువన ఉన్నాయి. దీంతో మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

కాగా ప్రపంచ సంపన్నుల జాబితాలో రెండవ స్థానంలో నిలిచిన ఒరాకిల్ ఛైర్మన్ లారీ ఎల్లిసన్ కంటే ఎలాస్ మస్క్ ఏకంగా 80 బిలియన్ డాలర్లు ఎక్కువ సంపదను కలిగివున్నారు. మస్క్ సంపదలో ఎక్కువ భాగం టెస్లా షేర్ల రూపంలో ఉంది. కంపెనీలో 13 శాతం వాటా షేర్లు ఆయనకు ఉన్నాయి. వీటి ప్రస్తుత విలువ ఏకంగా 145 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా స్పేస్‌ఎక్స్ కంపెనీ నిధుల సమీకరణ చేస్తోంది. ఇది పూర్తయితే మస్క్ సంపద మరో 1 బిలియన్ డాలర్లు పెరిగే సూచనలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News