Prashant Kishor: బీహార్ ఉప ఎన్నికల్లో ఒక్క సీటు గెలవకపోయినా ప్రశాంత్ కిశోర్ కు సంతోషం... కారణం ఇదే!

Prashant Kishor happy despite his party Jan Suraaj not winning even on seat in Bihar Bypolls
  • బీహార్ లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు
  • నేడు ఓట్ల లెక్కింపు
  • రెండు చోట్ల బీజేపీ... చెరోస్థానంలో జేడీయూ, హిందూస్థానీ అవామీ మోర్చా విజయం
  • తమ పార్టీకి శుభారంభం దక్కిందన్న ప్రశాంత్ కిశోర్
  • 10 శాతం ఓట్లు పొందామని వెల్లడి
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాజకీయాల్లోకి ప్రవేశించి జన్ సురాజ్ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. బీహార్ లో జరిగిన ఉప ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ అభ్యర్థులు కూడా బరిలో దిగారు. ఇవాళ ఓట్ల లెక్కింపు చేపట్టగా... జన్ సురాజ్ పార్టీ అభ్యర్థుల్లో ఒక్కరు కూడా గెలవలేదు. అయినప్పటికీ, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం ఉంది. 

ఈ ఉప ఎన్నికలు తమ పార్టీకి శుభారంభం అని భావిస్తున్నామని ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తాము 10 శాతం ఓట్లు పొందగలిగామని చెప్పారు. ఉప ఎన్నికల్లో తాము ఇలాంటి ఫలితాలను కోరుకోనప్పటికీ, తమ పార్టీ పుట్టింది నెల కిందటేనన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. 

10 రోజుల క్రితమే ఎన్నికల గుర్తు కేటాయించారని, ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో తాము పాదయాత్రలు కూడా చేయలేదని ప్రశాంత్ కిశోర్ వివరించారు. ఇంకా పార్టీ నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో జరగలేదని చెప్పారు. పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తామని అన్నారు. 

బీహార్ లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా... బీజేపీ రెండు స్థానాల్లో నెగ్గింది. మరో చోట హిందూస్థానీ అవామీ మోర్చా, ఇంకో నియోజకవర్గంలో జేడీయూ నెగ్గాయి.
Prashant Kishor
Jan Suraaj
Bypolls
Bihar

More Telugu News