Maharashtra: మహారాష్ట్రలో బీజేపీకి సింగిల్‌గా మెజారిటీ.. అఖండ గెలుపునకు కారణాలు ఇవే!

BJP managed a successful course correction in Maharashtra after set back in Lok Sabha polls
  • లోక్‌సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ నుంచి పాఠాలు నేర్చుకున్న బీజేపీ
  • అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్ని వర్గాలనూ ఆదరిస్తూ పనిచేసిన ఎన్డీయే సర్కారు
  • అభ్యర్థుల ఎంపిక నుంచి అసంతృప్తులను బుజ్జగించే వరకు అన్నింటిలోనూ సక్సెస్ అయిన బీజేపీ
  • కలిసొచ్చిన ‘లడ్కీ బెహన్’ స్కీమ్, రైతు రుణమాఫీ హామీ
సరిగ్గా ఆరు నెలల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మహారాష్ట్రలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా బీజేపీకి ఊహించని పరాభవం ఎదురైంది. ఆ పార్టీ వ్యూహాలు, మంత్రాలు పనిచేయలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా 28 ఎంపీ సీట్లు గెలుచుకున్న కాషాయ పార్టీ ఈసారి కేవలం 13 ఎంపీ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫలితంగా లోక్‌సభలో బీజేపీ సంఖ్యాబలాన్ని పరిమితం చేసింది. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక ఎంపీ స్థానాలున్న మహారాష్ట్రలో ఎదురుగాలి వీచిన పర్యవసానంగా... 2014 తర్వాత తొలిసారి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ కోసం మిత్రపక్షాలపై కాషాయ పార్టీ ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

అయితే లోక్‌సభ ఎన్నికల ఎదురుదెబ్బ నుంచి పాఠం నేర్చుకున్న బీజేపీ ప‌ట్టుదలగా ‘మహా’ వ్యూహరచన చేసింది. వ్యూహాత్మకంగా అడుగులు వేసి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని రీతిలో సత్తా చాటింది. అన్ని స్థానాల్లో పోటీ చేయకపోయినా సింగిల్‌గా ప్రభుత్వం ఏర్పాటు చేసేలా 149 సీట్లు గెలుచుకుంది. ఆ పార్టీ ప్రణాళికలు గ్రాండ్ సక్సెస్ అయినట్టు ఈ ఫలితాలు చాటిచెబుతున్నాయి. లోపాలను సరిదిద్దుకోవడంలో బీజేపీ నాయకత్వం 100 శాతం సఫలమైంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత అన్ని వర్గాలను ఆకట్టుకునేలా రాష్ట్రంలోని ఎన్డీయే సర్కారు సమతుల్యంతో పనిచేసేలా బీజేపీ వ్యవహరించింది. మహిళలు, గిరిజనులు, ఇతర వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందేలా జాగ్రత్తలు తీసుకుంది. 

ఇక పార్టీ, మహాయుతి కూటమిలో తిరుగుబాటు, అసంతృప్తి నేతలను బీజేపీ విజయవంతంగా శాంతింపజేసింది. ఈ విషయంలో మహా వికాస్ అఘాడీ విఫలమైంది. అభ్యర్థుల ఎంపికపై కూడా ఎన్డీయే కూటమి చాలా శ్రద్ధ పెట్టింది. అత్యుత్తమ అభ్యర్థులను ఎంపిక చేయడం కూడా కూటమికి బాగా కలిసొచ్చింది. సైద్ధాంతిక విభేదాలను సైతం సరిదిద్దుకొని, ఆర్ఎస్ఎస్‌ను సమన్వయం చేసుకుంటూనే అట్టడుగు స్థాయిలో ప్రచారం నిర్వహించడంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

మహిళల ఓట్లు కొల్లగొట్టిన లడ్కీ బెహెన్ స్కీమ్
మహారాష్ట్రలో ఎన్డీయే కూటమికి ‘లడ్కీ బెహెన్’ పథకం ఒక ఉత్ప్రేరకంగా పనిచేసింది. ఈ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు నెలకు రూ.1,500 నగదు బదిలీ చేసింది. తిరిగి అధికారంలోకి వస్తే రూ.2,100కి పెంచుతామని హామీ ఇచ్చింది. దీంతో మహిళా ఓటర్లు ఆకర్షితులయ్యారు.  

మరోవైపు ఓబీసీ కులాల ఏకీకరణ కోసం బీజేపీ చేసిన ప్రయత్నాలు కూడా సానుకూలంగా మారాయి. ఓబీసీలలోని వివిధ కులాల వర్గాలకు చేరువయ్యేందుకు.. వారి హక్కులను పరిరక్షిస్తామని హామీ ఇవ్వడం కూడా పార్టీకి మైలేజ్‌ను తీసుకొచ్చిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నారు. రిజర్వేషన్లను తొలగించేందుకు రాజ్యాంగాన్ని సవరిస్తామంటూ కాంగ్రెస్ బూటకపు వాగ్దానం చేసిందని ఓబీసీ వర్గాలను నమ్మించడంలో బీజేపీ సక్సెస్ అయ్యిందని చెబుతున్నారు. 

ఇక లోక్‌సభ ఎన్నికల్లో రైతుల ఆగ్రహాన్ని గుర్తుంచుకున్న బీజేపీ ‘రైతు రుణమాఫీ’ హామీని ఇవ్వడం బాగా ప్లస్ అయింది. అంతేకాదు ఉత్తర మహారాష్ట్రలోని ఉల్లి రైతులకు, విదర్భలో పత్తి, సోయాబీన్ రైతులకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకుంటామని వాగ్దానాలు చేయడం కూడా సానుకూలమైంది.
Maharashtra
Maharashtra Election
BJP
Narendra Modi
NDA

More Telugu News