PM Modi: 'మన్‌ కీ బాత్‌'లో పిచ్చుకల కనుమరుగుపై ప్రధాని మోదీ ఆవేదన

Sparrows Gone Away From Us says PM Modi Due To Increasing Urbanization in Mann Ki Baat

  • ఈరోజు 'మన్‌ కీ బాత్‌' 116వ ఎపిసోడ్ ప్ర‌సారం
  • పట్టణీకరణ కార‌ణంగా పిచ్చుక‌లు కనుమరుగవుతున్నాయన్న ప్ర‌ధాని
  • జీవ వైవిద్య నిర్వహణలో పిచ్చుక‌ల కీలకపాత్ర 
  • అందుకే వాటి జ‌నాభాను తిరిగి పెంచాల్సిన అవసరం ఉందన్న‌ మోదీ

ఈరోజు 'మన్‌ కీ బాత్‌' 116వ ఎపిసోడ్‌లో ప్రధాని న‌రేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా జీవ వైవిద్య నిర్వహణలో కీలకపాత్ర పోషించే పిచ్చుకల కనుమరుగుపై ఆయ‌న ఆవేదన వ్య‌క్తం చేశారు. పట్టణీకరణ కార‌ణంగా పిచ్చుక‌లు త‌గ్గిపోయిన‌ట్లు పేర్కొన్నారు. 

పట్టణీకరణ పెరిగిన కొద్ది పిచ్చుకలు కనుమరుగవుతూ వచ్చాయని, ఇప్పుడు ప‌ట్ట‌ణాల్లో ఎక్కడా పిచ్చుకలు కనిపించడం లేదని ప్రధాని ఆవేదన వ్య‌క్తం చేశారు. తిరిగి వాటి జనాభాను పెంచాల్సిన అవసరం చాలా ఉందని మోదీ గుర్తు చేశారు. 

చెన్నైలోని కుడుగల్‌ ట్రస్ట్‌ పిచ్చుకల జనాభా పెంపు కోసం చేస్తున్న కృషిని ప్రధాని ప్ర‌శంసించారు. ఈ ట్రస్ట్‌ వారు పిచ్చుకల జనాభా పెంచే ప్రయత్నంలో పాఠ‌శాల‌ పిల్లలను కూడా భాగస్వాములను చేయ‌డం ప్ర‌శంస‌నీయం అన్నారు. రోజువారీ జీవితంలో పిచ్చుకల ప్రాముఖ్యాన్ని గురించి కుడుగల్‌ ట్రస్ట్‌ వారు పిల్లలకు వివరిస్తున్నార‌ని గుర్తు చేశారు.

ఇక ఈ తరం పిల్లల్లో చాలా మందికి పిచ్చుకలను ప్రత్యక్షంగా చూసిన అనుభవం లేదన్నారు. కేవలం వీడియోల్లో, ఫొటోల్లో మాత్ర‌మే వాటిని చూపించాల్సి వస్తోందని మోదీ తెలిపారు. అలాంటి పిల్లలు పిచ్చుకలను ప్రత్యక్షంగా చూసే రోజు మళ్లీ రావాలని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని ఆకాంక్షించారు.  

  • Loading...

More Telugu News