Narendra Modi: పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌పై ముప్పేట దాడి

repeatedly rejected by people disrespect Parliament and democracy PM Modi attack on Congress

  • ప్రజలు పదేపదే తిరస్కరిస్తున్న వ్యక్తులు పార్లమెంట్‌, రాజ్యాంగాలను అవమానిస్తున్నారన్న మోదీ
  • గూండాయిజం ద్వారా సభలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు
  • మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ఓటమిని ఉద్దేశించి మోదీ విమర్శలు
  • పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన మోదీ

ఇవాళ్టి (సోమవారం) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. సమావేశాల ప్రారంభానికి ముందు విపక్ష కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముప్పేట దాడి చేశారు. ప్రజలు పదే పదే తిరస్కరించినవారు పార్లమెంటును, ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తున్నారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కొందరు వ్యక్తులు చేతికింద మనుషులను పెట్టుకొని గూండాయిజం ద్వారా పార్లమెంటును నియంత్రించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారి చర్యలన్నింటినీ దేశ ప్రజలు గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు వారిని మళ్లీ శిక్షిస్తారని అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరగాలని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించిన రెండు రోజుల తర్వాత ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ప్రజలు దాదాపు 80-90 సార్లు తిరస్కరించివారు పార్లమెంటులో చర్చలు జరగనివ్వడం లేదు. మన రాజ్యాంగంలో పార్లమెంటు, మన ఎంపీలు ఎంతో ముఖ్యం. పార్లమెంటులో అర్థవంతమైన చర్చలు జరగాలి. ఎక్కువ మంది ఎంపీలు చర్చలకు సహకారం అందించాలి. పలు విశేషాలతో ఈ పార్లమెంట్ సమావేశాలు చాలా ప్రత్యేకమైనవి. రాజ్యాంగం ఆమోదించి 75 సంవత్సరం ప్రారంభమవనుండడం అందులో ఒకటి’’ అని ప్రధాని మోదీ గుర్తుచేశారు. కాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లును ప్రవేశపెట్టవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇక ఈ సెషన్‌లో వక్ఫ్ సవరణ బిల్లు, విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లులు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు, రైల్వే చట్టం సవరణ బిల్లులు లోక్‌సభలో ప్రవేశపెట్టే సూచనలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News