Balineni Srinivasa Reddy: మరోసారి మీడియా ముందుకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. వైసీపీ నేత చెవిరెడ్డికి సవాల్

Balineni Srinivas Reddy challenged Chevireddy Bhaskar Reddy to come to the discussion if he has courage
  • ఎవరి మెప్పుకోసమో సెకీ ఒప్పందంపై మాట్లాడలేదన్న మాజీ మంత్రి
  • సీఎండీ దస్త్రం కూడా తన వద్దకు రాలేదని వెల్లడి
  • వైసీపీ నుంచి ఎందుకు బయటకు వచ్చానో చర్చకు సిద్ధమని వ్యాఖ్య
  • దమ్ముంటే చర్చకు రావాలంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సవాలు
  • చిత్తూరు జిల్లా నేతను తీసుకొచ్చి ఒంగోలులో నిలబెట్టడం నచ్చలేదని వెల్లడి
సెకీతో సౌరవిద్యుత్‌ ఒప్పందం అంశంలో తనకు ఏమాత్రం సంబంధం లేదని ఏపీ విద్యుత్ శాఖ మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి పునరుద్ఘాటించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మెప్పుకోసమే తాను సెకీ ఒప్పందంపై మాట్లాడానని విమర్శిస్తున్నారని, ఎవరి మెప్పు కోసమో తాను పనిచేయడం లేదని గుర్తుపెట్టుకోవాలని బాలినేని అన్నారు. సెకీతో ఒప్పందానికి సంబంధించి సీఎండీ దస్త్రం కూడా తన వద్దకు రాలేదన్నారు. వైసీపీ నేత చెవిరెడ్డి భాష్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. తాను వ్యక్తిగత విమర్శలు చేస్తే ఎవరూ తట్టుకోలేరని, తాను వైసీపీ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందో మొత్తం చెబుతానని, ధైర్యం ఉంటే చర్చకు రావాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆయన సవాల్ చేశారు. 

రాజశేఖర్ రెడ్డి కుటుంబం వల్లే తాను పైకి వచ్చానంటూ మాట్లాడుతున్నారని, వైఎస్సే రాజకీయ భిక్ష పెట్టారని జనసేనలో చేరినప్పుడు తానే మీడియా ముఖంగా చెప్పానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రస్తావించారు. ‘‘నేను విలువలు లేని రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు. వైఎస్‌పై అభిమానంతోనే మంత్రి పదవి వదులుకొని జగన్ పార్టీలోకి వెళ్లా. రాజశేఖర్ రెడ్డి మరణించాక మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవిని వదులుకున్నా. పవన్ వెంట ఉండి కూటమితో కలిసి పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను’’ అని ఆయన స్పష్టం చేశారు.

షర్మిల, విజయమ్మ వైఎస్ కుటుంబం కాదా?
రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే ఒక్క జగన్ మోహన్ రెడ్డేనా అని బాలినేని ప్రశ్నించారు. ‘‘షర్మిల, విజయమ్మ కాదా?. షర్మిల, విజయమ్మపై పోస్టులు పెడితే రాజశేఖర్ రెడ్డి కుటుంబం కానట్లు ఏమీ పట్టించుకోరా?’’ అని అన్నారు. ‘‘తిట్టేవాళ్లకే టికెట్లు ఇస్తామనే సంప్రదాయం ఎవరు కొనసాగిస్తున్నారో తెలుసు. చిత్తూరు జిల్లా అధ్యక్షుడిని తీసుకొచ్చి ఒంగోలులో టికెట్ ఇస్తారా?. ఒంగోలులో పోటీ చేసే నాయకుడే లేరని చిత్తూరు జిల్లా నుంచి తెచ్చారా?. చిత్తూరు జిల్లా నుంచి తీసుకొచ్చి నిలబెట్టడం నాకు నచ్చలేదు. అందుకే ఒప్పుకోలేదు’’ అని ఆయన అన్నారు.

కాగా గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదయిన లంచం అభియోగాలకు సంబంధించి.. సెకీతో ఏపీ సౌరవిద్యుత్‌ ఒప్పందంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై నాటి విద్యుత్‌శాఖ మంత్రి, ప్రస్తుతం జనసేనలో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవలే మీడియా సమావేశం నిర్వహించారు. సెకీ ఒప్పందం వెనుక ఇంత మ‌త‌ల‌బు ఉందని ఆనాడు ఊహించలేదని సందేహం వ్యక్తం చేశారు. అప్పట్లో ఇంధనశాఖ కార్యదర్శిగా పనిచేసిన శ్రీకాంత్‌ ఒక రోజు అర్ధరాత్రి ఒంటిగంటకు ఫోన్‌ చేసి సెకీతో ఒప్పంద ప‌త్రాల‌పై సంతకం చేయమన్నారని, అనుమానం రావడంతో తాను చేయలేదని, ఆ తర్వాత కేబినెట్‌లో పెట్టి ఆమోదింపజేసుకున్నారని బాలినేని వెల్లడించారు.
Balineni Srinivasa Reddy
Andhra Pradesh
YSRCP

More Telugu News