ISRO: వచ్చే నెల రెండు ప్రయోగాలను చేపట్టనున్న ఇస్రో
- డిసెంబర్ 4న పీఎస్ఎల్వీ సీ59 ప్రయోగం
- డిసెంబర్ 24న పీఎస్ఎల్వీ సీ60 ప్రయోగం
- పీఎస్ఎల్వీ సీ60 ద్వారా రిశాట్-1బీని నింగిలోకి పంపనున్న ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల ఇస్రో రెండు రాకెట్ ప్రయోగాలను చేపట్టనుంది. డిసెంబర్ 4న పీఎస్ఎల్వీ సీ59, డిసెంబర్ 24న పీఎస్ఎల్వీ సీ60 రాకెట్లను ప్రయోగించడానికి సిద్ధమవుతోంది.
శ్రీహరికోట షార్ లోని ప్రయోగ వేదికకు సంబంధించిన మొబైల్ సర్వీస్ టవర్ లో పీఎస్ఎల్వీ సీ59 రాకెట్ అనుసంధానం పనులు జరుగుతున్నాయి. పీఎస్ఎల్వీ ఇంటిగ్రేషన్ బిల్డింగ్ లో పీఎస్ఎల్వీ సీ60 అనుసంధానం పనులు కొనసాగుతున్నాయి.
పీఎస్ఎల్వీ సీ59 రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోభా-3 అనే ఉపగ్రహంతో పాటు మరో నాలుగు చిన్నతరహా ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగించనున్నారు. డిసెంబర్ 24న జరిగే పీఎస్ఎల్వీ సీ60 ద్వారా రిశాట్-1బీ అనే ఉపగ్రహంతో పాటు మరో నాలుగు వాణిజ్యపరమైన ఉపగ్రహాలను ప్రయోగించబోతున్నారు.