Coldest places: కాస్త చలికే వణికిపోతున్నాం... మరి ఇక్కడికి వెళితే?

We are shivering a bit from the cold How about going there
  • భూమ్మీద అత్యంత శీతల ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి
  • అందులో మనుషులు నివసించే ప్రదేశాలూ ఎన్నో
  • అక్కడ ఏడాది పొడవునా పూర్తిగా మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలే!
మనకు ఉష్ణోగ్రతలు పది, పదిహేను డిగ్రీల సెంటీగ్రేడ్‌ లకు తగ్గితేనే గజగజా వణికిపోతున్నాం. ఉదయం, సాయంత్రం స్వెట్టర్లు లేనిదే బయటికి రాలేకపోతున్నాం. కానీ భూమ్మీద కొన్నిచోట్ల అత్యంత శీతల పరిస్థితులు ఉంటాయి. అక్కడ ఎప్పుడూ మైనస్‌ డిగ్రీలలోనే ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మనం నోట్లోంచి ఆవిరి వదిలితే... అది అక్కడిక్కడే మంచుగా మారిపోయి కిందపడేంత చల్లగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో కొన్నిచోట్ల మనుషులు కూడా నివసిస్తుంటారు. మరి భూమ్మీద అత్యంత చల్లటి ప్రాంతాలేవో తెలుసుకుందామా...

డోమ్‌ ఫుజి, అంటార్కిటికా
భూమ్మీద ఇప్పటివరకు నమోదైన అత్యంత తక్కువ ఉష్ణోగ్రత ఇక్కడిదే. అంటార్కిటికాలోని డోమ్‌ ఫుజి ప్రాంతంలో 2010లో అత్యల్పంగా మైనస్‌ 93.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

వోస్తోక్‌ స్టేషన్‌, అంటార్కిటికా 
అంటార్కిటికా ఖండంలోని ఈ పరిశోధన కేంద్రం పరిసరాలలో... 1983 జూలై 21న మైనస్‌ (-) 89.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏడాది పొడవునా పరిశోధనలు జరిగే ప్రదేశం ఇది.

ఓయ్‌మ్యకోన్‌, సైబీరియా, రష్యా
సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాల్లో అత్యంత చల్లగా ఉండేది ఇదే. సమీపంలోని ఖనిజ నిక్షేపాల తవ్వకాల కోసం ఇక్కడ ఓ చిన్న పట్టణం ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు తరచూ మైనస్‌ 67 డిగ్రీల వరకు పడిపోతుంటాయి.

వెర్ఖోయానస్క్‌, సైబీరియా రష్యా 
ఇది కూడా ప్రజలు నివసించే ప్రాంతమే. ఇక్కడ చలికాలంలో ఉష్ణోగ్రతలు మైనస్‌ 50 డిగ్రీలకన్నా తగ్గిపోతూ ఉంటాయి.

నార్త్‌ ఐస్‌, గ్రీన్‌ లాండ్‌
కెనడాకు దగ్గరగా ఉండే గ్రీన్‌ ల్యాండ్‌ ఏడాది పొడవునా మంచుతోనే కప్పబడి ఉంటుంది. ఇక్కడ కూడా అంటార్కిటికా తరహాలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఇక్కడ మనుషుల శాశ్వత నివాసాలు లేవు.

స్నాగ్‌, యుకోన్‌, కెనడా
ఉత్తర అమెరికాలో అత్యంత శీతల పరిస్థితులు ఉండే ప్రాంతం స్నాగ్‌. ఇక్కడ ఇప్పటివరకు మైనస్‌ 63 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. తరచూ ఉష్ణోగ్రతలు మైనస్‌ 50 డిగ్రీల వరకు పడిపోతుంటాయి.

ఉలాంబటార్‌, మంగోలియా
ప్రపంచంలో అత్యల్ప ఉ‍ష్ణోగ్రతలు ఉండే ఒక రాజధాని ప్రాంతం ఉలాంబటార్‌. ఇక్కడ ఏటా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్‌ 30, మైనస్‌ 40 డిగ్రీల స్థాయికి పడిపోతుంటాయి.

ప్రాస్పెక్ట్‌ క్రీక్‌, అలాస్కా, యూఎస్‌ఏ
యూఎస్‌ఏలో అత్యంత శీతల ప్రదేశం ఇది. ట్రాన్స్‌ అలాస్కా పైప్‌ లైన్‌ పనులు చేయడం, నిర్వహణ కోసం గతంలో ఇక్కడ కార్మికులు, అధికారుల షెల్టర్లు ఉండేవి. కానీ అక్కడి దుర్భర వాతావరణం కారణంగా ఇప్పుడు మనుషులెవరూ ఉండటం లేదు.
Coldest places
offbeat
science
Viral News
Temperature
winter

More Telugu News