Imran Khan: ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారుల ఆందోళనలతో అట్టుడుకుతున్న పాక్.. ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది మృతి

5 killed in Pak as Imran Khan supporters march to Islamabad
  • ఇమ్రాన్‌ఖాన్ పిలుపుతో రోడ్డెక్కిన మద్దతుదారులు
  • రాజధాని ఇస్లామాబాద్ వైపుగా మార్చ్
  • ఆందోళనలకు నాయకత్వం వహించిన ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ, ఖైబర్ ఫఖ్తుంఖ్వా సీఎం అలీ అమీన్
  • మార్చ్‌ను అడ్డుకునేందుకు హైవేలు మూసివేసిన ప్రభుత్వం
  • భారీ మెషినరీ, సామగ్రితో నిరసనకారుల మార్చ్
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారుల ఆందోళనతో పాకిస్థాన్ అట్టుడుకుతోంది. ఇమ్రాన్ పిలుపుతో ఆయన పార్టీ తెహ్రీక్-ఇ-ఇన్ఫాఫ్ (పీటీఐ) కార్యకర్తలు లక్షలాదిమంది దేశ రాజధాని ఇస్లామాబాద్ వైపుగా మార్చ్ నిర్వహించారు. ఆదివారం ప్రారంభమైన ఈ మార్చ్‌కు ఖైబర్ ఫఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి అలీ అమీన్ గందాపూర్, ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ నేతృత్వంలో నాయకత్వం వహించారు.

ఇమ్రాన్‌ను విడుదల చేయాలన్న డిమాండ్‌తో ప్రారంభమైన మార్చ్ నిన్న సాయంత్రం ఇస్లామాబాద్‌కు చేరుకోగా సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. ఇది కాస్తా హింసాత్మకంగా మారడంతో ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల మంది పోలీసులు గాయపడ్డారు. ఇమ్రాన్ మద్దతుదారుల నిరసనలతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు నేడు రాజధానిలోని పలు వ్యూహాత్మక భవనాలు ఉన్న డీ-చౌక్‌‌ వరకు మార్చ్ నిర్వహించి అక్కడ సమావేశం కానున్నారు.

స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఓ పోలీసు అధికారి నిరసనకారుల తూటాలకు బలికాగా, మరో నలుగురు ఆందోళనకారుల వాహనాల కింద పడి ప్రాణాలు కోల్పోయారు. డజన్ల మంది గాయపడ్డారు. రాజధానివైపుగా వెళ్తున్న పీటీఐ కార్యకర్తలు పోలీసులపై దాడులకు తెగబడడంతోపాటు కనిపించిన వాహనాలకు నిప్పుపెట్టారు. 

పీటీఐ చీఫ్ అయిన ఇమ్రాన్ ఆదివారం దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. బానిసత్వ సంకెళ్లు తెంచాలని పేర్కొంటూ ప్రజలు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొనాలని కోరారు. ఆదివారం ఇస్లామాబాద్ వైపుగా మార్చ్ ప్రారంభమైంది. దీనిని అడ్డుకునేందుకు ప్రభుత్వం హైవేలను మూసివేసింది. రహదారులకు అడ్డంగా షిప్పింగ్ కంటెయినర్లు, కాంక్రీట్ అడ్డుగోడలు, బారికేడ్లు ఏర్పాటు చేసింది. అయితే, వాటిని తొలగించే పరికరాలు, భారీ మిషన్లతో ముందుకు కదిలిన ఆందోళనకారులు రాజధాని వైపుగా చొచ్చుకెళ్లారు. ఇది హింసాత్మక ఘటనలకు దారితీసింది. 
Imran Khan
Pakistan
PTI
Pak Violence
Protests

More Telugu News