railway line survey: బ్రిటిష్ హయాంలో ప్రారంభించిన సర్వే... ఇన్నాళ్లకు పూర్తయింది!

the railway line survey which started 112 years ago has now been completed

  • బ్రిటిష్ హయాంలో ప్రారంభించిన తనక్‌పూర్ – బాగేశ్వర్ రైల్వే లైన్ సర్వే
  • 170 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణానికి రూ.49వేల కోట్ల అంచనా వ్యయం
  • చైనా, నేపాల్ సరిహద్దుకు చేరనున్న రైల్వే మార్గం

తనక్‌పూర్ - బాగేశ్వర్ రైలు మార్గం కోసం చేపట్టిన రైల్వే లైన్ సర్వే ఎట్టకేలకు పూర్తయింది. బ్రిటిష్ హయాంలోనే రైల్వే లైన్ సర్వే ప్రారంభించినా ఇప్పటికి ఖరారైంది. దాదాపు 170 కిలోమీటర్ల పొడవైన ఈ రైలు మార్గాన్ని నిర్మించేందుకు రూ.49వేల కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ రైల్వే ప్రాజెక్టు పూర్తయితే భారతీయ రైల్వేలు చైనా, నేపాల్ సరిహద్దుకు చేరుకున్నట్లు అవుతుంది. 

తనక్‌పూర్..నేపాల్, చైనా సరిహద్దు ప్రాంతం. తనక్‌పూర్ - బాగేశ్వర్ రైలు మార్గం దశాబ్దాల కల. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో 1882లో తొలిసారిగా  రైలు మార్గాన్ని నిర్మించే పనిని ప్రారంభించింది. రైల్వే లైన్ కోసం మొదటి సర్వే 1912లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏడు సర్వేలు జరిగాయి. చివరిగా రెండేళ్లపాటు సాగిన తుది సర్వే నివేదికను స్కైలై ఇంజనీరింగ్ డిజైనింగ్ ద్వారా రైల్వే శాఖకు అందజేసింది. 
 
తుది సర్వే ప్రకారం .. తనక్‌పూర్ - బాగేశ్వర్ మధ్య రైలు మార్గంలో 12 రైల్వే స్టేషన్‌లను నిర్మించాల్సి ఉంది. 170 కిలోమీటర్ల రైల్వే లైన్ మధ్యలో ఈ రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు. రైల్వే లైన్ కోసం 452 హెక్టార్ల భూమిని కూడా సేకరించాల్సి ఉంది. ఇందులో 27 హెక్టార్లు ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూమి ఉంది. 
 
తనక్‌పూర్ - బాగేశ్వర్ రైలు మార్గాన్ని 2012లో కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యత కల్గిన ప్రాజెక్టుగా పరిగణించింది. అప్పట్లో ఈ రైల్వే లైన్‌లో 54 కిలోమీటర్ల మేర 72 సొరంగాలను ప్రతిపాదించారు. కాళీ నది ఒడ్డున తనక్‌పూర్ నుంచి పంచేశ్వర్ వరకూ ఈ రైలు మార్గాన్ని నిర్మించాలి. పంచేశ్వర్ దాటి సరయూ నది ఒడ్డున వెళుతుంది. ఈ రైల్వే లైన్ నిర్మాణం ద్వారా అల్మోరా, పితోర్‌గఢ్, చంపావత్, బాగేశ్వర్ జిల్లాలు నేరుగా ప్రయోజనం పొందుతాయి. అలాగే పర్వతానికి వెళ్లే మార్గం సులభతరం అవుతుంది. రైల్వే శాఖ తుది సర్వే పూర్తి అయిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో వేచి చూడాలి. 

  • Loading...

More Telugu News