Surrogate Mother: హైదరాబాదులో... సరోగసీ కోసం తీసుకువచ్చిన మహిళ అనుమానాస్పద మృతి

Woman died in Hyderabad in suspicious circumstances

  • మరో యువతి ద్వారా బిడ్డను కనాలని నిర్ణయించుకున్న హైదరాబాద్ దంపతులు
  • మధ్యవర్తి ద్వారా ఒడిశా యువతితో ఒప్పందం
  • ఆమెను తమ ఫ్లాట్ లో నిర్బంధించిన వైనం
  • ఆమెను కలిసేందుకు భర్తను కూడా అనుమతించని దంపతులు
  • 9వ అంతస్తు నుంచి పడి మరణించిన ఒడిశా యువతి

ఒడిశాకు చెందిన ఓ మహిళ హైదరాబాదులో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. ఓ అపార్ట్ మెంట్ తొమ్మిదో ఫ్లోర్ నుంచి పడిపోవడంతో ఆమె మరణించింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గంలో ఉన్న మై హోమ్ భూజా అపార్ట్ మెంట్ లో ఈ ఘటన జరిగింది. మృతి చెందిన యువతి పేరు అశ్వితా సింగ్. 

హైదరాబాద్ కు చెందిన రాజేశ్ బాబు (54), ఆయన భార్య... 25 ఏళ్ల అశ్వితా సింగ్ ను సరోగసీ కోసం హైదరాబాద్ తీసుకువచ్చారు. ఆమె ద్వారా తమ బిడ్డకు జన్మనివ్వాలనేది వారి ఆలోచన. సందీప్ అనే మధ్యవర్తి ద్వారా రూ.10 లక్షలకు ఒప్పందం కుదిరింది. అశ్వితా సింగ్ ను రాజేశ్ బాబు దంపతులు తమ ఫ్లాట్ లోనే ఉంచారు. ఆమె భర్తకు కూడా అదే అపార్ట్ మెంట్ లో మరో ఫ్లాట్ ఇచ్చారు. 

అయితే, ఆమెను రాజేశ్ బాబు దంపతులు తమ ఫ్లాట్ దాటి బయటకు రానిచ్చేవారు కాదని తెలుస్తోంది. అంతేకాదు, అశ్వితా సింగ్ ను కలిసేందుకు భర్తకు అనుమతి ఇచ్చేవారు కాదు! కాగా, ఆ యువతి ఇంకా గర్భవతి కాలేదు. వచ్చే నెల నుంచి సరోగసీ ప్రక్రియ మొదలుకానుంది. అంతలోనే ఆమె తొమ్మిదో అంతస్తు నుంచి పడిపోయి మృతి చెందడం అనుమానాలకు తావిస్తోంది. 

దీనిపై అశ్వితా సింగ్ భర్త మాట్లాడుతూ, రాజేశ్ బాబు తన భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడని ఆరోపించాడు. అశ్వితా సింగ్ అతడి ప్రవర్తన భరించలేక, ఆ ఫ్లాట్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించి, ఆ క్రమంలోనే కిందడిపోయి మరణించి ఉంటుందని భావిస్తున్నారు. బాల్కనీకి రెండు చీరలు, ఒక దుపట్టా ముడి వేసి ఉండడాన్ని గుర్తించారు. 

కాగా, యువతిని ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న ఆరోపణలపై పోలీసులు రాజేశ్ బాబుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నట్టు రాయదుర్గం ఎస్సై వెంకన్న తెలిపారు. ఒడిశా యువతి, ఆమె భర్త ఎప్పటి నుంచి ఆ అపార్ట్ మెంట్ లో ఉంటున్నారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News