Bihar Teacher: పగలు ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. రాత్రి జొమాటో డెలివరీ బాయ్.. ఎందుకలా?

Teacher By Day Food Delivery At Night Bihar Mans Struggle For Survival

  • తాత్కాలిక ప్రాతిపదికన ప్రభుత్వ నియామకంతో బీహారీ టీచర్ కు ఇక్కట్లు
  • రూ.8 వేల జీతంతో కుటుంబాన్ని పోషించలేకపోతున్నానని ఆవేదన
  • మరోమార్గంలేక రాత్రి పూట ఫుడ్ డెలివరీ చేస్తున్నట్లు వివరణ

ప్రభుత్వ ఉద్యోగం సాధించాక కలిగే ఆనందం మామూలుగా ఉండదు.. అందులోనూ రెండున్నరేళ్ల పాటు నిరుద్యోగిగా అవస్థ పడ్డాక ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే ఆ సంతోషం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బీహార్ లోని భాగల్పూర్ కు చెందిన అమిత్ కుమార్ కు ఎదురైన పరిస్థితి ఇది. పూట గడవని పరిస్థితిలో ఉన్న ఆ కుటుంబంలో ఈ వార్త వెలుగులు నింపింది. ఇక తమ కష్టాలు తొలగిపోయాయని ఇంటిల్లిపాది ఆనందించారు. అయితే, ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు.

పేరుకు ప్రభుత్వ ఉద్యోగమే అయినా నెలనెలా చేతికి అందే మొత్తం మాత్రం ప్రైవేటు ఉద్యోగానికన్నా తక్కువ. అలాగే మరో రెండున్నరేళ్లు నెట్టుకొచ్చిన అమిత్.. గత్యంతరంలేక రాత్రిపూట ఫుడ్ డెలివరీ బాయ్ గా కొత్త అవతారమెత్తాడు. పొద్దంతా స్కూలులో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పిల్లలను ఆటలవైపు ప్రోత్సహిస్తూ, సాయంత్రం కాగానే జొమాటో టీషర్టు వేసుకుని రోడ్డెక్కుతున్నాడు. అర్ధరాత్రి దాకా ఫుడ్ డెలివరీ చేసి ఇంటికి చేరుతున్నాడు. ఎందుకీ పరిస్థితి అని అడిగిన మీడియాకు అమిత్ చెప్పిన వివరాలు ఇవి..

2019 వరకు అమిత్ కుమార్ ఓ ప్రైవేటు స్కూలులో టీచర్ గా చేసేవాడు. అదేఏడాది జరిగిన టీచర్ నియామక పరీక్ష రాశాడు. ఫలితాల కోసం ఎదురుచూస్తూ ప్రైవేటు స్కూలులో పనిచేస్తుండగా కొవిడ్ మహమ్మారి దేశాన్ని వణికించింది. దీంతో చాలామందిలాగే అమిత్ కూడా ఉద్యోగం కోల్పోయాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం వెతుకుతూ తోచిన పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు.

దాదాపు రెండున్నరేళ్ల పాటు ఇలా ఇబ్బంది పడ్డ అమిత్ కు 2022 లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. 2019లో రాసిన టీచర్ నియామక పరీక్షలో 100 మార్కులకు 74 మార్కులు రావడంతో అమిత్ ను ఉద్యోగం వరించింది. అయితే, అది పార్ట్ టైమ్ బేసిస్ తో జరిపిన నియామకం కావడంతో అమిత్ కు నెలకు కేవలం రూ.8 వేలు మాత్రమే అందేవి. ప్రభుత్వం తొందర్లోనే ఫుల్ టైమ్ టీచర్ గా నియమిస్తుందనే ఉద్దేశంతో అమిత్ అందులోనే కొనసాగుతున్నాడు. పేరుకు పార్ట్ టైమ్ అయినా అమిత్ ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూలు పిల్లల మధ్యే గడుపుతూ వారిని ఆటల వైపు ప్రోత్సహిస్తూ వస్తున్నాడు.

వచ్చే జీతంతో ఇంటిని నడపడం రోజురోజుకూ కష్టంగా మారుతుండడం చూసి భార్య సలహాతో జొమాటో డెలివరీ బాయ్ గా మారిపోయాడు. పగలు స్కూలులో, రాత్రి జొమాటో బాయ్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తనలాంటి పార్ట్ టైం ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించాలని, ఫుల్ టైం ఉద్యోగిగా ప్రమోషన్ కల్పించాలని అమిత్ కోరాడు.

  • Loading...

More Telugu News