Ponnam Prabhakar: సోనియా గాంధీ పట్ల తెలంగాణలోని అన్ని పార్టీలు కృతజ్ఞతతో ఉండాలి: పొన్నం ప్రభాకర్
- సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్న
- తెలంగాణ కోసం ఎంతోమంది బలిదానాలు చేశారన్న మంత్రి
- కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తున్నారని విమర్శ
దశాబ్దాల కల అయిన తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ పట్ల రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కృతజ్ఞతతో ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. హన్మకొండ జిల్లాలోని కొత్తకొండ వీరభద్రస్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ఇవ్వాలనే దృఢసంకల్పం సోనియా గాంధీకి లేకుంటే రాష్ట్రం వచ్చేదా అని ఈరోజు దీక్షా దివస్ నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆలోచించాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు జరిగాయని, ఎంతోమంది బలిదానం చేశారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ఆరోజు పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టినట్లు చెప్పారు. తెలంగాణ ఏర్పాటును కించపరుస్తూ ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలు చేశారని, దీనిని రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు ఖండించడం లేదో చెప్పాలన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని హాస్టళ్లలో ఆహారం కలుషితం కాకుండా చూసేందుకు ఫుడ్ సేఫ్టీ కమిటీ వేసినట్లు తెలిపారు.