K Kavitha: జైలుకెళ్లిన వారు సీఎం అవుతారన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కవిత!
- జైలుకెళ్లిన వారు సీఎం అవుతారంటే కవితకు అవకాశం ఉందన్న రేవంత్ రెడ్డి
- ముఖ్యమంత్రి పదవి కాంట్రవర్సీ వ్యాఖ్యల కోసం లేదన్న కవిత
- జైలు జీవితం చిన్న గ్యాప్.. వెనక్కి తగ్గేది లేదన్న కవిత
జైలుకెళ్లిన వారు సీఎం అవుతారంటే బీఆర్ఎస్ నుంచి కవితకు ఆ అవకాశం ఉందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం తెలిసిందే. "జైలుకెళ్లి వచ్చిన వారు సీఎం అవుతారనే ఆలోచనతో కేటీఆర్ పదేపదే జైలుకు వెళతానని చెబుతున్నారు... కానీ ఆ అవకాశం కవితకు ఉంది" అని సీఎం ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు.
సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి కవిత స్పందిస్తూ... కాంట్రవర్సీ కోసం మాట్లాడటం... ప్రజలను ఎంటర్‌టైన్ చేయడం ముఖ్యమంత్రి పని కాదని గుర్తించాలన్నారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని హితవు పలికారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతోందని, కానీ రేవంత్ రెడ్డి ప్రతి ప్రసంగంలో కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఉపయోగపడే వాటి గురించి మాత్రం ఆయన మాట్లాడటం లేదన్నారు. కాంట్రవర్సి ప్రకటనల కంటే పరిపాలన మీద దృష్టి సారించాలని హితవు పలికారు.
బీఆర్ఎస్ పోరాటం వల్ల లగచర్ల పరిశ్రమను, ఇథనాల్ పరిశ్రమను రద్దు చేసుకున్నారని, అదానీ ఇచ్చిన రూ.100 కోట్లను వెనక్కి ఇచ్చారని... ఇలా తాము ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామన్నారు. ప్రభుత్వానికి ఏడాది అవకాశం ఇవ్వాలని కేసీఆర్ చెప్పడంతో తాము ఆగిపోయామని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగడతూనే ఉంటామన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలన్నీ వెనక్కి తీసుకునేలా చేస్తామన్నారు.
జైలు జీవితం చిన్న గ్యాప్
రాజకీయాల్లో తన జైలు జీవితం చిన్న గ్యాప్ మాత్రమేనని... అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన వెనక్కి తగ్గేది లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమెను టీవీ9 ఛానల్ పలకరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రతి అంశంపై నేతలు స్పందించాల్సిన అవసరం ఉంటుందన్నారు. ప్రజల అవసరాలను బట్టి వివిధ అంశాలపై స్పందిస్తామన్నారు.
తనపై అక్రమంగా కుట్రపూరితంగా పెట్టిన కేసు అని, అది తన రాజకీయ జీవితంలో చీకటి రోజు అన్నారు. అది "జస్ట్ పాజ్ మాత్రమే" అన్నారు. ఇలాంటి కుట్రలను అధిగమిస్తామన్నారు. రాజకీయ కుటుంబం నుంచి, ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చామని కాబట్టి ప్రజా సమస్యలపై మాట్లాడుతూనే ఉంటామన్నారు.
బీసీ కులగణన గురించి మాట్లాడుతున్న తనను టార్గెట్ చేస్తున్నారంటే తనను చూసి అవతలి వారు భయపడుతున్నట్లే అన్నారు. మనకు రాజకీయాల కంటే ప్రజలు ముఖ్యమన్నారు. తాను మాట్లాడితే పదిమందికి ఉపయోగపడుతుందంటే అందుకు సిద్ధమే అన్నారు. తెలంగాణలో ఇప్పుడు పదిరోజులకో పసిబిడ్డ ప్రాణం కోల్పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అంశాలపై స్పందిస్తామన్నారు.