Holistic Cards: ఏపీ విద్యార్థులకు త్వరలో హోలిస్టిక్ కార్డులు

Holistic Progress Report Cards To Govt School Children In AP
  • ప్రతీ కార్డుపై లోపలి పేజీల్లో క్యూఆర్ కోడ్
  • విద్యార్థి పూర్తి సమాచారం నమోదు
  • ప్రభుత్వ పాఠశాలలకు విద్యాశాఖ రేటింగ్
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇకపై హోలిస్టిక్ కార్డులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థి ఎత్తు, బరువు, బీఎంఐ, బ్లడ్ గ్రూప్ సహా పూర్తి వివరాలను ప్రతీ ఆరు నెలలకు ఒకసారి వీటిలో నమోదు చేస్తారు. ఇప్పటి వరకు ఇస్తున్న ప్రోగ్రెస్ కార్డులకు మార్పులు చేర్పులు చేసి ఈ హోలిస్టిక్ కార్డులను రూపొందించారు. ప్రతీ కార్డులోనూ క్యూఆర్ కోడ్ ను అధికారులు ముద్రించారు. ఈ కార్డులు విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి, విద్యార్థిని మరింతగా తీర్చిదిద్దేందుకు తోడ్పడతాయని వివరించారు. 

అదేవిధంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అందుతున్న విద్య, విద్యార్థులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను బట్టి 1 నుంచి 5 వరకు స్టార్లు ఇస్తారు. దీంతో రేటింగ్ తక్కువగా ఉన్న స్కూళ్లపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి వాటిని మెరుగుపరిచే వీలుంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే నెల 7 లోగా ఈ ప్రక్రియ పూర్తిచేసి, పేరెంట్స్ టీచర్ మెగా మీటింగ్ లో చర్చించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మరోవైపు, ఈ మీటింగ్ కు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని, ఆహ్వాన పత్రికలు కూడా సిద్ధమయ్యాయని తెలుస్తోంది. పేరెంట్స్ కు ఆహ్వాన పత్రిక పంపడంతో పాటు వారి మొబైల్ ఫోన్లకు సందేశాలు కూడా పంపుతున్నట్లు అధికారులు తెలిపారు.
Holistic Cards
Govt Schools
Children
Andhra Pradesh

More Telugu News